న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయర్వేద, ఇతర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా మేలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఫైనల్ కీని విడుదల చేసిన కొద్ది గంటలకే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ ఫలితాలను వెబ్ సైట్ https://neet.nta.nic.in/ లో ఉంచింది. ఫలితాల్లో టాప్-10 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులకు చోటు దక్కలేదు. అయితే టాప్-100లో తెలంగాణ విద్యార్థులు పలు ర్యాంకులు సాధించారు.
జీవన్ సాయికుమార్ 18, షణ్ముఖ నిషికాంత్ అక్షింతల 37, ఎం.వరుణ్ 46, వై షణ్ముఖ్ 48, విదిశా మాజీ 95వ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. అలాగే ఏపీకి చెందిన కార్తీక్ రామ్ కిరీటి 19, కొడవటి మోహిత్ శ్రీరామ్ 56, దేశిన సూర్య చరణ్ 59, పి అవినాశ్ 64, వై సమీర్ కుమార్ 70, టి శివమణి 92వ ర్యాంక్ సాధించారు.
తెలంగాణ రాష్ట్రంలో 33 ప్రభుత్వ మెడికల్, రెండు డీమ్డ్, 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీలుండగా, వీటిలో 8,515 సీట్ల వరకు ఉన్నాయి. నీట్-యూజీలో రాజస్థాన్‌కు చెందిన మహేశ్ కుమార్ మొదటి ర్యాంక్ సాధించగా, మధ్యప్రదేశ్‌కు చెందిన ఉత్కర్ష్ అవాదియా రెండో ర్యాంక్ పొందినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. 22.09 లక్షల మంది పరీక్షకు హాజరు కాగా, అందులో 12.36 మంది అర్హత సాధించారు. ఇది నిరుడు 13.15 లక్షల కన్నా ఇది తక్కువ. అర్హత సాధించిన వారిలో మహిళలు 7.2 లక్షల మంది ఉండగా, పురుషులు 5.14 లక్షల మంది ఉన్నారు. .
కాగా, దేశంలోని 1,08,000 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ప్రతి ఏడాది ఎన్టీఏ నీట్-యూజీని నిర్వహిస్తున్నది. ఇందులో 56 వేల సీట్లు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో, 52 వేలు ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నాయి. నీట్ ద్వారా దంత, ఆయుర్వేద, యునాని, సిద్ధ వంటి ఇతర వైద్య కోర్సుల్లో కూడా ప్రవేశాలను నిర్వహిస్తారు.
నీట్-యూజీ 2025 పరీక్ష స్కోర్ కార్డును..మార్చేస్తామంటూ అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సీబీఐ పట్టుకుంది. పరీక్ష స్కోర్ కార్డును తారుమారు చేసేందుకు రూ.90 లక్షలను డిమాండ్ చేసిన సోలాపూర్, ముంబయిలకు చెందిన సందీప్ షా, సలీమ్ పటేల్‌లను సీబీఐ ఇటీవల అరెస్టు చేసింది.
తక్కువ మార్కులు ఉన్న అభ్యర్థులను, వారి తల్లిదండ్రులను ఆకర్షించి..సీటు లభించే విధంగా చేస్తామంటూ తప్పుడు హామీలతో వల పన్ను తున్నారని, విద్యార్థులను మోసం చేయడానికి నిందితులు అనుసరించిన విస్తృత పన్నాగాన్ని తమ దర్యాప్తులో బయటపెట్టామని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతి ఒక్క అభ్యర్థి నుంచి రూ.90 లక్షల్ని నిందితులు డిమాండ్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో ఎన్టీఏ అధికారుల ప్రమేయం ఉన్నట్టుగా ఆధారాలు లభ్యం కాలేదని సీబీఐ పేర్కొన్నది.