హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కార్పొరేట్‌కు దీటుగా గురుకులాల్లో విద్య, వసతులు అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురుకులాలకు చెందిన 3,000 మందికిపైగా విద్యార్థులు నీట్, ట్రిపుల్ ఐటీ, మెడిసిన్ సీట్లు సాధించారని వెల్లడించారు. ఆదివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, నోముల భగత్, బానోత్ హరిప్రియ, సండ్ర వెంకటవీరయ్య, కౌసర్ మోహియుద్దీన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ రాకముందు 226 గురుకులాలు ఉండేవని, ఆ తర్వాత 706 గురుకులాలు ఏర్పాటు చేశామని వివరించారు. 2014 వరకు 6 వేలమంది బోధన, బోధనేతర సిబ్బంది మాత్రమే ఉండగా, ప్రస్తుతం 25 వేలమంది పనిచేస్తున్నారని చెప్పారు. 2014 వరకు 1.25 లక్షల మంది విద్యార్థులు గురుకులాల్లో చదివితే, ఇప్పుడు ఆ సంఖ్య 5.19 లక్షలకు చేరిందని చెప్పారు. గతంలో రూ.700 కోట్లు ఖర్చు చేస్తే, స్వరాష్ట్రంలో రూ.9,442 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. 2023-24 బడ్జెట్లో గురుకులాల కోసం రూ.3 వేలకోట్లు ప్రతిపాదించినట్టు తెలిపారు. రాష్ట్రంలో 709 గురుకులాలను, విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 476 రెసిడెన్షియల్, మోడల్, కస్తూర్బా పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశామని వివరించారు. వాటిలో 68 డిగ్రీ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయగా, 53 మహిళల కోసమే కేటాయించామని చెప్పారు. గురుకులాల్లో 5 పీజీ, రెండు లా కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశామని, వాటిల్లో సరిపడా సిబ్బందిని త్వరలో నియమిస్తామని మంత్రి ప్రకటించారు.
ఐదేండ్లలో సంపూర్ణ అక్షరాస్యత
రాబోయే ఐదేండ్లలో రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిరక్షరాస్యతను రూపుమాపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అక్షరాస్యతపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, 2019లోనే ఈచ్ వన్.. టీచ్ వన్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 1,779 పాఠశాలల్లో 1.64 లక్షల మంది నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పే బాధ్యతను విద్యార్థులు తీసుకున్నారని, ఈలోపే కరోనా రావడంతో ఇబ్బంది ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రంలో డ్రాపౌట్స్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఏటా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు.