హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం టూరిజం పేరుతో నీరా చరిత్రను చెరిపివేయాలని దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదని, అలా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. నీరాకేఫ్‌ను యథావిధిగా కొనసాగించాలని, లేకుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని బొందపెట్టేందుకు వెనకాడబోమని తెలిపారు. సోమవారం నెక్లెస్‌రోడ్‌లోని నీరా కేఫ్ వద్ద జాతీయ, రాష్ట స్థాయి గౌడ సంఘాల నేతలతో కలిసి శ్రీనివాస్‌గౌడ్ ప్లకార్డులు చేతబూని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా కొత్త పనులు చేపట్టి ఉన్నదాన్ని మరింత సుందరంగా తీర్చి దిద్దుతారు. కానీ, ఉన్నది తీసేస్తారా? అని శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ దుర్మార్గులు, చరిత్రహీనులు చేసే పనిగా పేర్కొన్నారు. ‘ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు? బిడ్డా మేము ఊదితే.. మీరంతా కొట్టుకుపోతారు.. కేసీఆర్ తెచ్చిన నీరా చరిత్రను తుడిపేసే కుట్ర చేస్తున్నారా? ఖబర్దార్’ అంటూ హెచ్చరించారు.
గీత కార్మికులు చెట్లు ఎక్కే ప్రతిమలను తీసేసి ట్యాంక్‌బండ్‌లో పడేస్తారా? ఎందుకంత అహంకారం? అని మండిపడ్డారు. నీరా కేఫ్‌ను ముట్టుకుంటే ఊరుకునేది లేదని, అన్ని గౌడ సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గౌడన్నలను భయభ్రాంతులకు గురి చేస్తున్నదని, ఇప్పటికే వందల మంది గౌడన్నలను జైళ్లలో పెట్టే పరిస్థితులు వచ్చాయని ఆరోపించారు. కేసీఆర్ ముందుచూపుతో దేశంలో ఎక్కడాలేని విధంగా నీరా కేఫ్ తీసుకొచ్చారని, దాంతో గౌడన్నలు కాలర్ ఎగరేసుకొని బతికినట్టు గుర్తుచేశారు. కేసీఆర్ ప్రోత్సాహంతో నీరా కేఫ్‌ను నిర్మించుకున్నాం. దాని జోలికి వస్తే ఊరుకునేది లేదు అని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. మా ఆత్మగౌరవన్ని దెబ్బతీస్తున్నారు, నార్కోటిక్ డ్రగ్స్ పేరుతో గౌడన్నలను వేధిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నీరా కేఫ్‌లో టూరిజం శాఖకు ఎలాంటి అధికారం లేదని, మొత్తం బీసీ సంక్షేమశాఖ డబ్బులని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ‘నాటి ప్రభుత్వం కార్పొరేషన్ నుంచి కట్టిన బిల్డింగ్ ఇది. ల్యాండ్ మాత్రమే టూరిజం శాఖది. మెయింటనెన్స్ కోసమే వారికి ఇచ్చాం. దీనిని టాడి టాపర్స్ కార్పొరేషన్‌కు అడిగితే.. మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ వెంటనే జీవో ఇచ్చారు. మా చరిత్రను తుడిపేసే ప్రయత్నం చేస్తే.. సర్వాయి పాపన్న వారసులమంతా ప్రాణాలకు తెగించి కొట్లాడుతం’ అని ధ్వజమెత్తారు.
కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, గౌడ, కల్లుగీత సంఘాల నాయకులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, వెంకటనర్సయ్య, అంబాల నారాయణగౌడ్, విజయ్‌కుమార్‌గౌడ్, కల్లుగీత కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అయిలి వెంకన్న, సాయిలుగౌడ్, నాగభూషణంగౌడ్, గౌడ విద్యార్థి సంఘం నాయకుడు శ్రీకాంత్‌గౌడ్, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు యాదయ్యగౌడ్, బండి సాయన్న, ప్రభాకర్‌గౌడ్, రామ్మోహన్‌గౌడ్, మానసగౌడ్, రమేశ్‌గౌడ్, మోహన్‌సింగ్ అహ్లూవాలియా పాల్గొన్నారు.