హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలనలో అరిగోసపడ్డ గౌడన్నలు.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. ఎన్నో కుటుంబాలు ఆధారపడ్డ గీతవృత్తికి స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పునరుజ్జీవం పోశారు. 50 ఏండ్లుపైబడిన గీతకార్మికుడికి నెలనెలా రూ.2,016 పింఛన్, చెట్టు పన్ను రద్దు, మూతపడ్డ దుకాణాలకు అనుమతి ఇచ్చి గౌడ కులస్థుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. ప్రస్తుతం గీతకార్మికులకు చేతినిండా పని, డబ్బులు ఉండేలా నీరాకేఫ్‌లకు రూపకల్పన చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున.. నెక్లెస్ రోడ్డులో అధునాతన హంగులతో నిర్మించిన నీరాకేఫ్‌ను బుధవారం అట్టహాసంగా ప్రారంభించనున్నారు.
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణ సర్కారు వైన్స్ షాపుల కేటాయింపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించింది. కల్లుగీత కార్మికులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రెండో విడత హరితహారంలో భాగంగా ఈత మొక్కలు నాటారు. 2016-17 నుంచి 2022-23 వరకు మొత్తం 410.19 లక్షల ఈత/ ఖర్జూర మొకలు నాటారు. వాటి సంరక్షణకోసం కొన్ని చోట్ల బిందు సేద్య సౌకర్యం కూడా కల్పించారు.
గీత కార్మికులకు రాష్ట్ర సర్కారు ప్రత్యేకంగా ఆసరా పింఛన్లు, ప్రమాదవశాత్తు చనిపోతే కార్మికుడి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా సైతం అందజేస్తున్నది. 2016 నుంచి టీఎఫ్టీ సభ్యులకు ఆసరా పింఛన్లను వర్తింపజేస్తున్నది. జూలై 2019 నుంచి వారి పెన్షన్‌ను రూ.2016కు పెంచింది. అలాగే, ఆసరా పింఛన్ల అర్హత వయసును 50 ఏండ్లకు తగ్గించింది. ప్రస్తుతం 65,545 లబ్ధిదారులకు మొత్తం రూ.158.56 కోట్లను వెచ్చించి, నెలనెలా టంచన్‌గా పింఛన్లు అందజేస్తున్నది. ప్రమాదవశాత్తు చెట్టుపైనుంచి పడి మరణించిన కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తున్నది. ఏదైనా వైకల్యం సంభవిస్తే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పరిహారం ఇస్తున్నది. ఇప్పటి వరకు 698 మరణించిన కేసుల్లో, 1,809 శాశ్వత వైకల్యానికి గురైన కేసుల్లో, 2,475 తాత్కాలిక వైకల్యానికి గురైన కేసుల్లో మొత్తం రూ.53.50 కోట్లను ఎక్స్‌గ్రేషియా కింద ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు చెల్లించింది. 2014 నుంచి 2022 మార్చి వరకు 4,982 మంది లబ్ధిపొందారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కల్లు లైసెన్స్ కాల పరిమితిని పొడిగించారు. ఐదేండ్ల కాలాన్ని ప దేండ్లకు పొడిగిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. ఏటా రూ.16 కోట్ల మేర కల్లు అద్దెను తెలంగాణ సర్కారు మాఫీ చేస్తున్నది. వీటికితోడు రూ.7,982 కోట్ల కల్లు బకాయిలు మాఫీ చేసింది.దీంతో 4,366 టీసీఎస్, 3,709 టీఎఫ్టీఎస్లు కలిపి మొత్తం 2,18,107 మంది సభ్యులు లబ్ధిపొందుతున్నారు. సమైక్య రాష్ట్రంలో ప్రతి చెట్టుకు కోత సంబంధిత రుసుం రూ.150, వాటి దరఖాస్తుకు రూ.500ను చెట్ల యజమానుల నుంచి వసూలు చేసేవారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ సర్కారు అవన్నీ రద్దు చేసి.. టీసీఎస్, టీఎఫ్టీ సభ్యులకు పరిహారం కింద రూ.1020ను ఎదురు చెల్లిస్తున్నది. టీసీఎస్, టీఎఫ్టీ పథకాల కింద లైసెన్స్ కలిగిన 8,128 దుకాణాల్లో కల్లు విక్రయాలకు అనుమతించి, గౌడన్నల సంక్షేమానికి పెద్దపీట వేసింది. వీటితోపాటు 2,620 ఏ4 మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం రిజర్వేషన్ కేటాయించి, దుకాణాలు అప్పగించింది. వ్యక్తులపై కక్ష కారణంగా జీహెచ్ఎంసీలో రద్దు చేసిన కల్లు దుకాణాలను పునరుద్ధరించి 86 దుకాణాలకు అనుమతులిచ్చింది. దీంతో 2,963 మంది లబ్ధి పొందుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం గౌడ కులస్థులకు ఉపాధి కల్పించడంతోపాటు తెలంగాణ ప్రజలకు స్వచ్ఛమైన, ప్రకృతిసిద్ధమైన నీరాను అందించాలని నిర్ణయించింది. రూ.12.20 కోట్లతో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులో నీరా కేఫ్‌ను సుందరంగా నిర్మించింది. ఇదే స్ఫూర్తితో భువనగిరిలోని నందనం, రంగారెడ్డిలోని ముద్విన్, సంగారెడ్డిలోని మునిపల్లి, నల్లగొండలోని సర్వేల్లో నాలుగు నీరా సేకరించే కేంద్రాల కోసం ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 319 మంది గీత కార్మికులను గుర్తించి, వారికి శిక్షణ ఇప్పించింది. నెక్లెస్ రోడ్‌లోని నీరా కేఫ్‌ను మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తిచేసింది.
తెలంగాణలోనే గౌడ కులస్థుల జీవితాలు బాగుపడ్డాయి. క్షేత్రస్థాయిలో ఎవరికి ఏది కావాలో తెలిసిన ఏకైన నాయకుడు మన సీఎం కేసీఆర్. ఆయన అమలు చేస్తున్న పథకాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలతో గీతకార్మికుల జీవితాల్లో వెలుగులొచ్చాయి. గౌడ కులస్థుల సంక్షేమానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నది. ప్రాణపదమైన చేతివృత్తిని కాపాడటంపై లక్షలాది కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నీరా కేఫ్‌లను విస్తరించి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి