Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): అది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌లో ఒక పిల్లర్ కుంగిపోగానే వాయువేగంతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) స్పందించింది. సంఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నది. ఇంజినీర్లు కనీసం పిల్లర్ వద్దకు వెళ్లి పరిశీలించకుండానే హస్తినకు తిరిగి పయనమై ఆగమేఘాలపై ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో దాని ఆధారంగా కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్పై బురదజల్లాయి. కట్ చేస్తే… మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్ కుంగుబాటు ఘటన జరిగి ఏడాదిన్నర దాటుతున్నది.
కానీ, నిన్నటిదాకా ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇవ్వలేదు. నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పదేపదే లేఖలు రాస్తున్నది కానీ, హస్తిన నుంచి స్పందన కనిపించదు. అదేమంటే, ప్రాథమిక నివేదికలో సూచించిన దానికి భిన్నంగా తెలంగాణ ఇంజినీర్లు మేడిగడ్డ దగ్గర గ్రౌటింగ్ పనులు చేసి సాక్ష్యాలను చెరిపివేశారంటూ ఎన్డీఎస్ఏ అలక బూనుతుంది. మేమేమీ చేయలేమని చేతులెత్తేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చే వరకూ మేడిగడ్డను పునరుద్ధరించబోమంటూ భీష్మించుకు కూర్చుంటుంది.
అసలు తాము తుది నివేదిక ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారంటూ ఇన్నాళ్లూ తెలంగాణ ఇంజినీర్లపై ఆరోపణలు చేసిన ఎన్డీఎస్ఏ.. ఏదో కల పడినట్టు.. ఉపద్రవమేదో ముంచుకొచ్చినట్టు.. రాత్రికి రాత్రి కాళేశ్వరం బరాజ్‌లపై నివేదిక ఇచ్చింది. అదీ సరిగ్గా… బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు రెండు రోజుల ముందు! సభ చారిత్రాత్మకంగా జరగనున్నదనే స్పష్టమైన సంకేతాలు, ప్రజల్లో అనూహ్య స్పందన వస్తున్న ఇలాంటి తరుణంలో ఈ ఉలికిపాటు దేనికి సంకేతం?! ఏడాదిన్నరలో కాంగ్రెస్ సర్కారు వరుస వైఫల్యాలు… రైతులు సహా అన్నివర్గాల్లో పెల్లుబికుతున్న అసంతృప్త జ్వాలలు… ఏ గ్రామానికి పోయినా కేసీఆర్ సారే మళ్లీ రావాలంటూ తెలంగాణ ప్రజలు వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలు.. ఇంకేముంది? కాంగ్రెస్‌కు కేసీఆర్ భయం పట్టుకున్నది.
ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టమొచ్చిన ప్రతిసారీ పరోక్షంగా ఆదుకుంటున్న హస్తినలోని బీజేపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందుకే ఉన్నఫలంగా ఎన్డీఎస్ఏ నివేదిక రూపంలో కాంగ్రెస్ పార్టీకి దన్నుగా నిలిచేలా డైవర్షన్ రాజకీయానికి తెర లేపింది. ఎలాగూ మరో నెలన్నరలో వర్షాలే మొదలవుతాయి. అంటే, మరమ్మతు పనులకు మరో ఏడాది ఆగాల్సిందే. మరి ఇన్నాళ్లూ మీనమేషాలు లెక్కించిన ఎన్డీఎస్ఏ.. ఈ సమయంలో నివేదికను ఇవ్వడమంటేనే ‘దాల్ మే కుచ్ కాలాహై!’ అనేది అక్షర సత్యం.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారం.. దేశంలో ఎక్కడ ఎలాంటి డ్యామ్‌లు, ప్రాజెక్టులకు ప్రమాదం వాటిల్లినా.. వాటిపై వెంటనే తనకు తానుగా స్పందించి, వాటిని సందర్శించి, వివరాలు తెలుసుకుని, నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి సిఫారసులు చేయాల్సిన అధికారం, బాధ్యత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి ఉన్నది. అందుకు అనుగుణంగానే 2023 అక్టోబర్ 21న మేడగడ్డ బరాజ్‌లోని పిల్లర్ కుంగుబాటునకు గురైన వెంటనే ఆ చట్టాన్ని ఆసరా చేసుకుని ఎన్డీఎస్ఏ.. ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్జైన్తోపాటు కే శర్మ, ఆర్ తంగమాణి, రాహుల్ కే సింగ్, దేవేందర్‌రావు, కేజీబీవో నామినేట్ చేసిన ఇద్దరు సభ్యులతో కమిటీని వెంటనే ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వెంటనే అంటే అక్టోబర్ 23న రాష్ర్టానికి వచ్చింది.
24 తేదీన మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించింది. 25న తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, ప్రాజెక్టు అధికారులు, బరాజ్ నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై సాంకేతిక అంశాలన్నింటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నది. బరాజ్ నిర్మాణానికి ముందు చేపట్టిన పరీక్షలు, నిర్మించిన విధానం, అందుకు వినియోగించిన యంత్ర పరికరాలకు సంబంధించిన అంశాలపై ఆరా తీసింది. తదుపరి మరో 20 సాంకేతిక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించింది. ఆ పూర్తి సమాచారాన్ని రాష్ట్ర అధికారులు ఇవ్వకముందే 29వ తేదీ నాటికే కాళేశ్వరం బరాజ్ ఘటనపై ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.
అదీ అప్పటి ప్రభుత్వానికి ఇవ్వకుండా నేరుగా పత్రికలకు విడుదల చేసింది. ఎలాంటి పరీక్షలు, పరిశోధనలు చేయకుండానే కేవలం క్షేత్రస్థాయి సందర్శన ద్వారానే బరాజ్ కుంగుబాటునకు డిజైన్, నాణ్యత లోపాలు కారణాలంటూ ఎన్డీఎస్ఏ నిర్ధారించడం గమనార్హం. అటు తరువాత ఎన్డీఎస్ఏ మళ్లీ స్పందించలేదు. అంతేకాదు, అంతర్జాతీయ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఉచిత సలహాలు ఇచ్చింది తప్ప పూర్తిస్థాయి విచారణకు మాత్రం ముందుకురాలేదు.
స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం, అధికారం ఉన్నా, నాలుగు నెలలపాటు ఎన్డీఎస్ఏ ఏనాడూ మేడిగడ్డ ఘటనపై మళ్లీ స్పందించలేదు. మేడిగడ్డ బరాజ్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించి, లోపాలను గుర్తించడంతోపాటు తదుపరి చేపట్టాల్సిన పునరుద్ధరణ చర్యలపై తగిన సిఫారసులు చేయాలని కోరుతూ కేంద్ర జల్‌శక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 13న విజ్ఞప్తి చేసింది. అప్పుడు గాని ఎన్డీఎస్ఏ మళ్లీ స్పందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా మేడిగడ్డ బరాజ్ ఘటనకు సంబంధించి అధ్యయనానికి సీడబ్ల్యూసీ, గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఎన్డీఎస్ఏ ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీని 2024 మార్చిలో నియమించింది. అయితే, నాడు వారంరోజుల్లోనే నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏను ఈసారి మాత్రం నాలుగు నెలల్లో రిపోర్టు ఇవ్వాలని కేంద్రం ఆదేశించడం గమనార్హం.
ఆ నిపుణుల కమిటీ 2024 మార్చి 6,7,8,9 తేదీల్లో, ఆ తరువాత 20,21,22 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించింది. స్వయంగా వెళ్లి మూడు బరాజ్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. నిర్మాణ ఏజెన్సీలతో, అందులో భాగస్వాములైన అధికారులతోనూ భేటీ అయ్యింది. బరాజ్‌లకు సంబంధించిన నిర్మాణ డిజైన్లు, తదితర డాక్యుమెంట్లను సైతం ఇరిగేషన్ అధికారులను అడిగి తీసుకున్నది. తుదకు సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల ముందు 2024 మే 7న కేవలం మధ్యంతర నివేదికను ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్‌జైన్ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు పంపించారు. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే డిజైన్, నిర్మాణం, ఓఅండ్ఎం తదితర వైఫల్యాల మూలంగానే బరాజ్ పిల్లర్ కుంగిందని ఊహాజనితంగా రిపోర్టు ఇచ్చారు. దానిపై నాడు నానా హడావుడి చేశారు. 2024 డిసెంబర్ నాటికి తుది నివేదికను అందిజేస్తామని అనాడే వెల్లడించారు. కానీ, ఇప్పటివరకు బయటపెట్టలేదు.
మొత్తం పరిణామాలను గమనిస్తే.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్లు బీఆర్ఎస్ను బద్నాం చేయడమే లక్ష్యంగా ఆదినుంచీ పావులు కదుపుతున్నాయని స్పష్టమవుతున్నది. మేడిగడ్డ ఘటన జరిగిన నాటినుంచి ఇప్పటివరకు ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్న తీరే అందుకు బలాన్ని చేకూర్చుతున్నది. తాజాగా ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఏర్పాటుతో అది మరోసారి బట్టబయలైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో సాగునీరు అందక పంటలు ఎండిపోతుండడంతో రైతాంగం కన్నెర్ర చేస్తున్నది. పాలన పడకేయగా సబ్బండ వర్గాల్లో వ్యతిరేకత పెల్లుబికుతున్నది. దీంతో సర్కారు ఉక్కిరిబిక్కిరవుతున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఏర్పాటు చేయడం, తెలంగాణ వ్యాప్తంగా విశేష స్పందన వస్తున్నది.
గులాబీ పార్టీకి మరింత ఆదరణ పెరుగుతున్నది. దీంతో ఇప్పుడు సర్కారు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, బీఆర్ఎస్ను మరోసారి బద్నాం చేసేందుకు పూనుకోగా, కేంద్రం తనవంతుగా లోపాయికారీ సహకారాన్ని అందిస్తున్నది. కేంద్రం సైతం కాంగ్రెస్ సర్కారును గట్టేక్కించేందుకు ఇప్పుడు నివేదికను బయటపెట్టినట్టు తెలిసిపోతున్నది. మొత్తంగా రెండు పార్టీలు కూడబలుక్కుని కాళేశ్వరం ప్రాజెక్టును ఖతం పట్టించి, తద్వారా బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను బద్నాం చేయాలని పన్నాగాలు పన్నుతున్నాయని రాజకీయ విశ్లేషకులు బలంగా వాదిస్తున్నారు. అందుకు ఇరు పార్టీలు వ్యవహరిస్తున్న తీరు బలాన్ని చేకూర్చుతున్నది.
మేడిగడ్డ బరాజ్ ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక దాదాపు రెండు నెలల క్రితం సిద్ధమైంది. నిపుణుల కమిటీ ఈ ఏడాది జనవరి నెలాఖరునే తన తుది నివేదికను ఎన్డీఏఎస్ చైర్మన్‌కు అందజేయగా, ఆయన దానిని కేంద్ర జల్శకి ్తశాఖకు సమర్పించారు. ఈ విషయాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ ఉన్నతాధికారులే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలియజేశారు. అంతేకాదు, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ లేవనెత్తిన అంశాలను ఉటంకిస్తూ సీతారామ ప్రాజెక్టుకు సైతం తుది అనుమతులను నిరాకరించారు. డిజైన్లను పరిశీలించిన తరువాతే తుది అనుమతులను ఇస్తామని టీఏసీలో కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టం చేసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ, దాదాపుగా రెండు నెలలుగా కేంద్ర జల్‌శక్తి శాఖ నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టినట్టు తేటతెల్లమవుతున్నది. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆ నివేదికను సీడబ్ల్యూసీకి పంపి పరిశీలన పేరిట కాలయాపన చేసింది. ఇటీవల కాలంలో కూడా ‘నివేదిక ఎక్కడ?’ అని రాష్ట్ర అధికారులు అడిగినా, కేంద్రం ఉలుకూపలుకు లేకుండా ఉండిపోయింది. కానీ, సరిగ్గా బీఆర్ఎస్ పార్టీ రతతోత్సవ సభకు రెండు రోజుల ముందే హఠాత్తుగా ఒక్కసారిగా నివేదికను కేంద్రం పంపడం గమనార్హం.
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం కమిషన్ నివేదిక తుది దశకు చేరుకున్నది. మరో రెండు వారాల్లో ప్రభుత్వానికి సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణ లోపాలపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్‌ను ప్రభుత్వం నిరుడు ఫిబ్రవరిలో ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ ఇప్పటికే ఇరిగేషన్‌శాఖ ఇంజినీర్లు, డిజైన్లు, డీపీఆర్, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది. కాగ్ అధికారులను సైతం పలు అంశాలపై ప్రశ్నించింది. ఆయా అంశాలన్నింటినీ క్రోడీకరించి దాదాపు 400 పేజీలతో రిపోర్టును తయారు చేస్తున్నట్టు సమాచారం.
ఇటీవల విజిలెన్స్ అందించిన నివేదికలను కమిషన్ అధ్యయనం చేస్తున్నది. ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) తుది నివేదిక కూడా రావాల్సి ఉన్నది. ఆ నివేదికలోని అంశాలను కూడా పొందుపర్చి రిపోర్టును సిద్ధం చేయనున్నది. కమిషన్ గడువు ఈ నెల 30న ముగియనున్న నేపథ్యంలో మరో నెల రోజులపాటు పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గురువారం టీవీ9లో ప్రసారమైన వార్తలు