హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆనకట్టల భద్రతకు సంబంధించిన అన్ని అంశాలపై చ ర్చించేందుకు ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) చైర్మన్ అనిల్ జైన్ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. జలసౌధలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర సేఫ్టీ ఆర్గనైజేషన్ అధికారులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. జలాశయాలు సురక్షితంగా ఉండేందుకు సరైన నిఘా, తనిఖీ, నిర్వహణ, రక్షణతోపాటు ప్రమాదాలకు బాధ్యులను నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021ను తీసుకురావడంతోపాటు ఎన్డీఎస్ఏ సిఫారసులు-2023 పేరిట అందు కు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆనకట్టల పరిమాణం, ఎత్తు, తదితర ప్రమాణాల ఆధారంగా రాష్ట్రంలో మొత్తంగా 175 ప్రాజెక్టులు ఎన్డీఎస్ఏ చట్టం పరిధిలోకి వచ్చాయి.
డ్యామ్‌ల భద్రతపై సమగ్ర మూల్యాంకనం (సీడీఎస్ఈ) జరపడం ఎన్డీఎస్ఏ చట్టం అమలుకు అత్యంత కీలకం. ఈ ప్రక్రియను 2026 డిసెంబర్ నాటికి పూర్తిచేయాల్సి ఉన్నది. సీడీఎస్‌ఈని ఆయా ప్రాజెక్టుల యజమానులు నిర్వహించాల్సి ఉన్నది. ఎన్డీఎస్ఏ చట్టంలోని సెక్షన్ 38(1) ప్రకారం సంబంధిత ఆనకట్ట భద్రతకు సంబంధించి సమగ్ర మూల్యాంకనం (సీడీఎస్ఈ) నిర్వహించాలి. ఇందులో భాగంగా డ్యామ్‌ల రిస్క్ అసెస్మెంట్ స్టడీ నిర్వహించడం (ఆనకట్టల ప్రస్తుత పరిస్థితి, గతంలో ఏమైనా ప్రమాదాలు సంభవించాయా? మున్ముం దు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నదా? అనే అంశాలతోపాటు కరకట్టలు, గేట్ల స్థితిగతులపై పూర్తిగా అధ్యయనం చేయడం), ఊహించని ప్రమాదం సంభవిస్తే అత్యవసరం ఉపశమన చర్యల కోసం ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయడం, డ్యామ్‌ల భద్రతపై సమగ్ర మూల్యాంకనం చేయడం ముఖ్యం. వీటితోపాటు ప్రతి ఆనకట్టకు సంబంధించి డిజిటల్ లాగ్‌బుక్‌లను, పూర్తి డాటాబేస్‌ను డిజిటల్ రూపంలో పొందుపరచాలి.
ముఖ్యంగా ఆనకట్ట పేరు, కవర్పేజీతోపాటు అది ఏ జిల్లాలో, ఏ గ్రామంలో ఉన్నది, అందుకు సంబంధించిన లొకేషన్, అందుబాటులో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టు వివరాలతోపాటు ఆ ఆనకట్టను ఏ రివర్ బేసిన్లో, ఏ నది మీద నిర్మించారు? డ్యామ్ ఏవిధమైంది? ఏ ప్రయోజనం కోసం నిర్మించారు? (తాగునీటి కోసమా? సాగునీటి కోసమా? విద్యుత్తు ఉత్పత్తి కోసమా?), నిర్మాణం ఎప్పుడు పూర్తయ్యింది? ఆ డ్యామ్ ఎత్తు, గ్రాస్, లైవ్ స్టోరేజీ కెపాసిటీ, ఫౌండేషన్ లోతు ఎంత? ఎన్ని గేట్లు, హెడ్‌రెగ్యులేటర్లు ఉన్నాయి?, ఆయకట్టు, కరకట్టల వివరాలు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల వివరాలు, ఆపరేషన్ ప్రొటోకాల్ తదితర వివరాలన్నీ క్రోడీకరించి రిపోర్టు సిద్ధం చేయా లి. డ్యామ్‌కు సంబంధించిన ప్రాజెక్టు అధికారి పేరు, హోదా, ఆ అధికారి బాధ్యతలు స్వీకరించిన తేదీ, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ తదితర అంశాలను సైతం వివరించాల్సి ఉంటుంది. ప్రతి ఆనకట్టకు సంబంధించి సీడీఎస్‌ఈని 2026 డిసెంబర్‌నాటికి పూర్తి చేయాల్సి ఉన్నది. ప్రస్తుతం అందుకు మరో 15 నెలల గడువు మాత్రమే ఉన్నది. కానీ, రాష్ట్రంలో ఇప్పటికీ ఒక్క ఆనకట్టకూ సీడీఎస్‌ఈని రూపొందించలేదు. ఈ విషయమై ఇటీవల ముఖ్యమంత్రికి స్వయం గా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రే లేఖ రాశారు.