హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ‘బరాజుల్లో నీళ్లు నింపితే కొట్టుకుపోతయి. ఊళ్లు మునుగుతయ్. గేట్లన్నీ తెరిచి పెట్టాలని ఎన్డీఎస్ఏ చెప్పింది. ఆ ప్రకారమే నడుచుకుంటం. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మరమ్మతులు చేసిన తర్వాతే వినియోగంలోకి తీసుకొస్తం’ అని రేవంత్ సర్కార్ చెప్తున్న.. చేస్తున్న ప్రచారమంతా పచ్చి అబద్ధమని మరోసారి బట్టబయలైంది. కాంగ్రెస్ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు కాళేశ్వరం ప్రాజెక్టు బలవుతున్నదని స్పష్టమైంది. ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసుకోవచ్చని, పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర సర్కారే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తాజాగా ఎన్డీఎస్ఏ హైకోర్టుకు ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ మేరకు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. వెరసి ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ కుట్రలన్నీ మరోసారి బయటపడ్డాయి. కరువు నేపథ్యంలోనూ ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్టును పడావు పెడుతూ, రైతాంగానికి శిక్ష విధిస్తున్నదని స్పష్టమైంది.
ఎన్డీఎస్ఏ 378 పేజీలతో నివేదిక సమర్పించింది. అందులో అన్ని అంశాలనూ ప్రభుత్వం వక్రీకరించి ప్రాజెక్టుపై విష ప్రచారానికి పూనుకొన్నది. ప్రధానంగా మేడిగడ్డ, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణాలు పూర్తిగా కూలిపోయాయని ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్తూ ప్రాజెక్టును పడావు పెట్టింది. కానీ వాస్తవంగా నిర్దిష్ట పరీక్షలు నిర్వహించిన అనంతరం 7వ బ్లాక్‌ను పునరుద్ధరించాలని, తద్వారా మేడిగడ్డ బరాజ్‌ను వినియోగంలోకి తేవచ్చని ఎన్డీఎస్ఏ తన నివేదికలో స్పష్టంచేసింది. అదీగాక మేడగడ్డ 7వ బ్లాక్ వద్ద ఏర్పడిన సాంకేతిక సమస్యలు ఇతర బ్లాకుల్లో, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో తలెత్తవచ్చని, ముందస్తుగా అందుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించుకోవాలని మాత్రమే ఊహాజనిత సలహా ఇవ్వగా ప్రభుత్వం మాత్రం మేడిగడ్డ తరహాలోనే అన్ని బ్లాకుల్లో సమస్యలు ఉన్నట్టు ఎన్డీఎస్ఏ వెల్లడించిందంటూ పూర్తిగా వక్రీకరించింది. అంతేకాదు ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతులు, నిర్వహణ, వినియోగం తదిర అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకే ఉంటుందని కూడా ఎన్డీఎస్ఏ నివేదికలో స్పష్టంగా నొక్కిచెప్పింది.
కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఎన్డీఎస్ఏపైనే నెపం మోపి ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చింది. ప్రస్తుతం ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, మరోవైపు ప్రాణహిత నుంచి జలాలు దిగువకు వృథాగా పోతున్నాయని, వాటిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి నుంచి ఎత్తిపోయాలని బీఆర్ఎస్ అడుగడుగునా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది. బరాజ్‌ల నుంచి నీటిని ఎత్తిపోయవచ్చంటూ తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లు సైతం స్పష్టంచేశారు. సర్కార్‌కు లేఖ రాశారు. మేడిగడ్డలో సాంకేతికంగా నీటిని నిల్వ చేయకున్నా ప్రస్తుతం ప్రాణహిత జలాలను కన్నెపల్లి నుంచి ఎత్తిపోసుకోవచ్చని, ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో తలెత్తిన సీపేజీ సమస్యలను గతంలో అరికట్టామని, అవి వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని అధికారవర్గాలు సైతం వెల్లడిస్తున్నాయి. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఎన్డీఎస్ఏ గత నివేదికలనే సాకుగా చూపుతూ బరాజ్‌లను వినియోగించుకోలేమంటూ, నీటిని ఎత్తిపోసేది లేదంటూ పదేపదే తెగేసి చెప్తున్నది. కన్నెపల్లి నుంచి నీటి ఎత్తిపోతలు చేపట్టకుండా దిగువకు వృథాగా వదిలేస్తున్నది. తెలంగాణ రైతాంగాన్ని నిలువునా ముంచుతున్నది. కరువు కాలంలో పగబట్టి శిక్షిస్తున్నది.
కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రచారం నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ లక్ష్మీనర్సింహ గుప్తా ఇటీవల నేరుగా ఎన్డీఎస్ఏకు మెయిల్ చేశారు. బరాజ్‌ల వినియోగం అంశాలకు సంబంధించి స్పష్టతనివ్వాలని కోరారు. అందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఒకటని, రాష్ట్రంలో నీటిపారుదల, తాగునీరు, పారిశ్రామిక నీటి సరఫరాలో ముఖ్యపాత్ర పోషిస్తుందని వివరించారు. దాని పరిమాణం, ప్రాముఖ్యత దృష్ట్యా ప్రాజెక్టు భద్రత, నిర్మాణ పటిష్టత, నిర్వహణ ప్రమాణాలకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా మూల్యాంకనం చేసి నిర్ధారించాలని అభ్యర్థించారు. కరువు నేపథ్యంలో ఎత్తిపోతలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మరమ్మతులు చేసేదాకా ప్రాజెక్టును వినియోగించలేమని తెగేసి చెప్తున్నదని, ఈ నేపథ్యంలో ప్రాజెక్టును సురక్షితంగా ఉపయోగించవచ్చా? లేదా? అనే అంశంపై స్పష్టతనివ్వాలని కోరారు.
దీనికి ఎన్డీఎస్ఏ స్పష్టమైన సమాధానమిచ్చింది. కాళేశ్వరం నుంచి నీటిపోతల బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విధానపర నిర్ణయమేనని, తమకేమీ సంబంధం లేదని తేల్చిచెప్పింది. డ్యామ్ భద్రతా చట్టం 2021 ప్రకారం ఎన్డీఎస్ఏ స్థాపితమైందని గుర్తుచేసింది. తమ సంస్థ కేవలం డ్యామ్ వైఫల్యం, సంబంధిత విపత్తుల నివారణ కోసమే పనిచేస్తుందని, అందులో భాగంగా నిర్దిష్టమైన డ్యామ్‌ల పర్యవేక్షణ, తనిఖీ, నిర్వహణ, మరమ్మతులు అందించడం, వాటి సురక్షిత పనితీరును నిర్ధారించడానికి సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి అనుబంధ అంశాలపైనే పనిచేస్తుందని వివరించింది. తమ ప్రాథమిక దృష్టి ప్రత్యేకంగా డ్యామ్‌లు, బరాజ్‌ల భద్రత, నిర్మాణ పటిష్టతపై మాత్రమే ఉంటుందని తెలిపింది. ఆయా ప్రాజెక్టుల ప్రణాళికకు సంబంధించి అంటే నీటిని ఎకడ, ఏ వినియోగం కోసం తీసుకోవాలనే కార్యాచరణ నిర్ణయాలు తమ పరిధిలోకి రాబోవని తేల్చిచెప్పింది.
సాగునీటి కోసం, కరువు పరిస్థితుల్లో తాగునీటి కోసం నీటి కేటాయింపులు, వినియోగానికి సంబంధించిన నిర్ణయాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విధానపరమైన అంశాలేనని స్పష్టంచేసింది. మేడిగడ్డ బరాజ్, అనుబంధ నిర్మాణాల భద్రత, పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర జల్‌శక్తి ఆధ్వర్యంలో సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైందని, ఆ కమిటీకి ఎన్డీఎస్ఏ సాంకేతిక సభ్యుడు నేతృత్వం వహిస్తున్నారని, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)తో పాటు సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) తదితర సంస్థల నిపుణులు సభ్యులుగా ఉన్నారని గుర్తుచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రైతులకు నీటిని పంపింగ్ చేయాలా? వద్దా? అనే కార్యనిర్వహణ, విధానపరమైన నిర్ణయాల్లో ఎన్డీఎస్ఏకు ఎలాంటి పాత్ర లేదని సమాధానమిచ్చింది. నీటి వినియోగ అంశాన్ని సమగ్రంగా పరిశీలించి, ప్రాజెక్టు ద్వారా ఆశించిన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని నొక్కిచెప్పింది. వెరసి ఇప్పటివరకు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమంతా వట్టిదేనని నాడే తేలిపోయింది. నేడు హైకోర్టులో అవే అంశాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయడంతో కాంగ్రెస్ కుట్రలన్నీ మరోసారి బట్టబయలయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లో పిల్లర్ కుంగిపోయిన ఘటనను అదనుగా తీసుకుని కాంగ్రెస్ రాజకీయాలకు తెరతీసింది. ప్రాజెక్టుపై మరింత దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఘటన జరిగిన వెంటనే బీజేపీ నేతలు లేఖ రాయడం, హుటాహుటిన ఎన్డీఎస్ఏ రంగంలోకి దిగడం, పరిశీలనలేవీ చేయకుండానే నివేదిక పేరిట హడావుడి చేయడం చకచకా జరిగిపోయాయి. ఘటన జరిగిన రెండు రోజుల్లోనే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ అధికారుల బృందం రాష్ర్టానికి వచ్చింది. వారం తిరగకముందే ఎలాంటి పరీక్షలు చేయకుండానే బరాజ్ కుంగుబాటునకు అనేక ఊహాజనిత కారణాలను విశ్లేషిస్తూ నివేదిక విడుదల చేసింది. మళ్లీ ఈ ఏడాది మార్చి వరకు బరాజ్ ఊసెత్తలేదు.
అటు తర్వాత ఎట్టకేలకు బరాజ్ కుంగుబాటుకు కారణాలను అధ్యయనం చేసి, పునరుద్ధరణ చర్యలను సిఫార్సు చేసేందుకు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ 2024 మార్చిలో రెండు పర్యాయాలు పర్యటించింది. క్షేత్రస్థాయిలో పరిశీలనతోపాటు, ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీల నుంచి వివరాలు సేకరించింది. రాష్ట్ర అధికారులు సూచించిన అంశాలనే అటు తర్వాత నిపుణుల కమిటీ యథాతథంగా పొందుపరుస్తూ మధ్యంతర నివేదిక అందజేసింది. మళ్లీ ఏడాది పాటు 2025 ఏప్రిల్ వరకు తుది నివేదిక సమర్పించలేదు. కాంగ్రెస్ సైతం అదే రాజకీయాలకు పూనుకున్నది. ప్రాజెక్టు సందర్శన పేరిట హడావుడి చేసింది.
ఆ తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. మరోవైపు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసింది. విచారణ అంశాలను అనుకూల మీడియా సంస్థలకు లీకులిస్తూ ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలకు తెరలేపింది. డిఫెన్స్‌లో పడిపోయిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదికి తేవడం పరిపాటిగా మారింది. ఆ తర్వాత బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రెండు రోజుల ముందు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ 378 పేజీల నివేదిక విడుదల చేయడం, అది క్షణాల్లోనే ఇరిగేషన్‌శాఖకు చేరకముందే మీడియాకు లీకు కావడం గమనార్హం. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చకు పెట్టి కాంగ్రెస్ సర్కార్ రచ్చచేసింది. నివేదిక వచ్చినా ఏడాది పాటు పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదు. ఎన్డీఎస్ఏ నిలదీసిన అనంతరం ఏడాది తర్వాత ఇటీవలే ఆ పనులు చేపట్టినా అవి మందకొడిగానే కొనసాగుతున్నాయి.