హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహాయక చర్యలు ఎందుకు చేపట్టడం లేదని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. దేశమంతటా ఎల్ నినో ప్రభావంతో కరువు ఏర్పడితే.. తెలంగాణలో మాత్రం రేవంత్ సర్కార్ కరువు తెచ్చిందని ధ్వజమెత్తారు. ఆ కరువు సన్నద్ధత చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
పక్కరాష్ట్రమైన మహారాష్ట్ర కరువు మండలాలను ప్రకటించి, రూ.5,000 కోట్లు విడుదల చేసిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం కరువును ఎదుర్కొనేందుకు కనీస చర్యలు చేపట్టకపోవడం విచారకరమని పేర్కొన్నారు. హైదరాబా ద్ తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గాంధీనాయక్, వెంకటేశ్‌గౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కరువు కోరల నుంచి రాష్ర్టాన్ని బయట పడేసేందుకు కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ఆధారంగా ఉన్నా.. దానిని సర్కార్ నిర్వీర్యం చేయడమే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు.
కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నా కేసీఆర్‌పై కక్షతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిగువకు నీటిని వదిలి రాష్ట్ర ప్రజలను దుర్భిక్షంలోకి నెట్టారని మండిపడ్డారు. బొట్టూబొట్టూ ఒడిసిపడితే ఈ దుస్థితి ఉండేదికాదని తేల్చిచెప్పారు. మహారాష్ట్ర తరహాలో రైతుల పంట రుణాలు రీషెడ్యూల్ చేయాలని, మళ్లీ కొత్తగా మంజూరు చేయాలని, విద్యార్థులకు ట్యూషన్ ఫీజులను వాయిదా వేయాలని, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, జాబ్ కార్డులున్న కుటుంబాలకు నెలకు రూ.1,000 చొప్పున ఆర్థికసాయం అందించాలని, సామాజిక పింఛన్ సొమ్మును పెంచాలని డిమాండ్ చేశారు.
కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా విద్యుత్తురంగాన్ని తయారుచేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని జీవన్‌రెడ్డి కొనియాడారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా సాగుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన గొప్ప పాలనాదక్షుడని ప్రశంసించారు. కానీ, రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రజలు అవస్థల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సింగరేణి జైపూర్ విద్యుత్తు ప్లాంట్‌ను రాజస్థాన్‌కు తాకట్టుపెట్టే కుట్రలకు తెరలేపారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో వెలుగులు విరజిమ్మిన తెలంగాణను రేవంత్‌రెడ్డి తిరిగి రాతియుగంలోకి తీసుకెళ్లారని దెప్పిపొడిచారు.
అధికారంలోకి వచ్చిన తొలిఏడాదే 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి మూడేళ్లలో 30 వేలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. కానీ మొన్న సిరిసిల్లకు వెళ్లి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడం సిగ్గుచేటని జీవన్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? గత ప్రభుత్వం ఇచ్చినవి ఎన్ని? కాంగ్రెస్ సర్కార్ కచ్చితంగా భర్తీచేసిన ఉద్యోగాలెన్ని అన్న వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు దారుణంగా పెరిగిపోతున్నదని, ఎన్నికల హామీ మేరకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.