ములుగు, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన కల్యాణలక్ష్మి పథకానికి కారణమైన భాగ్యతండా రాష్ట్రంలోని లక్షలాది పేదల ఇండ్లలో సౌభాగ్యం నింపిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకం రూపుదిద్దుకొని 12ఏండ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత కార్యక్రమాన్ని శుక్రవారం ములుగు జిల్లా మల్లంపల్లి మండలం గుర్తూరుతండా గ్రామపంచాయతీ పరిధిలోని భాగ్యతండాలో నిర్వహించారు.
మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు హాజరై పథకానికి కారకులైన భాగ్యతండాకు చెందిన కీమానాయక్, రుక్కమ్మతోపాటు వారి కూతురు కల్పన, ఇతర కుటుంబ సభ్యులను సన్మానించారు. కనకదుర్గమ్మ గుడిలో పూజలు నిర్వహించి గ్రామస్తులతో కలిసి నృత్యాలు చేశారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పథకానికి కారణమైన భాగ్యతండా ప్రపంచపటంలో నిలిచిపోతుందని చెప్పారు.
దేశానికి గాంధీజీ స్వాతంత్య్రం తీసుకొస్తే.., రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధి చేసిన కేసీఆర్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని వరంగల్ జడ్పీ మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. ఉద్యమ సమయంలో ప్రజల కష్టాన్ని గుర్తుంచుకొని కల్యాణలక్ష్మి వంటి పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు వంటి పథకాలను తెచ్చి ఆడబిడ్డలకు అండగా నిలిచిన కేసీఆర్‌ను తెలంగాణ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు.
గాంధీ మార్గంలో తెలంగాణను సాధించిన కేసీఆర్ రాష్ర్టానికి జాతిపితగా నిలుస్తారని మానుకోట జడ్పీ మాజీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుం డా పదేండ్లపాటు అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు.
కీమానాయక్కు వచ్చిన కష్టాన్ని ఉద్యమ సమయంలో చూసి, సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలెవరికీ అలాంటి కష్టాలు రావొద్దనే కల్యాణలక్ష్మి వంటి పథకాలను తీసుకొచ్చిన మానవతావాది కేసీఆర్ అని ములుగు జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్, మండల పార్టీ నాయకుడు పాలెపు శ్రీనివాస్, గ్రామ నాయకుడు హరిలాల్ తదితరులు పాల్గొన్నారు.
పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రుల కష్టాన్ని తీర్చిన పథకం కల్యాణలక్ష్మి అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో బాల్యవివాహాలు, మాతృ, శిశు మరణాలు తగ్గాయని పేర్కొన్నారు.
తెలంగాణ స్వరూపాన్ని మార్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని మానుకోట మాజీ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తెలంగాణ ఆడబిడ్డలకు వరంగా నిలిచాయన్నారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులు చేసిన మోసానికి ఆడబిడ్డలు గోసపడుతున్నారని చెప్పారు.
ఉద్యమ రోజులు
కాంగ్రెస్ నాయకుల పాలనలో ప్రస్తుతం తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకు వస్తున్నాయని కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ అన్నారు. కల్యాణలక్ష్మి వంటి పథకాలు ఉద్యమ నాయకుడైన కేసీఆర్‌తోనే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.