హైదరాబాద్, ఫిబ్రవరి 12 ( నమస్తే తెలంగాణ ) : ఏడాది వ్యవధి గల బీఈడీ, ఎంఈడీ కోర్సులు మళ్లీ అందుబాటులోకి రానున్నాయా..? గతంలో ఉన్న ఈ కోర్సులను మళ్లీ పునరుద్ధరిస్తారా..? అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) వర్గాలు అవుననే చెబుతున్నాయి. ఈ మేరకు కొత్త ముసాయిదాను ఎన్సీటీఈ సిద్ధం చేసింది. పదేండ్ల తర్వాత పాత కోర్సులను పునరుద్ధరించనున్నది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులు అమల్లోకి రానున్నాయి. వాస్తవానికి ఏడాది కాలపరిమితి గల బీఈడీ, ఎంఈడీ కోర్సులు గతంలో ఉండేవి. 2014లో తీసుకున్న నిర్ణయం మేరకు వీటి స్థానంలో రెండేండ్ల బీఈడీ, ఎంఈడీ కోర్సులు ప్రవేశపెట్టగా, తిరిగి మళ్లీ తీసుకురావాలని ఇటీవలే ఎన్సీటీఈ నిర్ణయించింది.
ఏడాది బీఈడీ, ఎంఈడీ కోర్సులను ప్రవేశపెట్టినా రెండేండ్ల కోర్సులు యథావిధిగా కొనసాగుతాయి. ఏడాది ఎంఈడీని ఫుల్‌టైం కోర్సుగా, రెండేండ్ల ఎంఈడీని పార్ట్‌టైమ్‌గా అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ పార్ట్‌టైమ్ కోర్సులో వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే.. ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లు, ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్లు చేరవచ్చు. ఏడాది బీఈడీ కోర్సులో నాలుగేండ్ల డిగ్రీ(ఆనర్స్) పూర్తిచేసిన వారు మాత్రమే అర్హులు. మూడేండ్ల డిగ్రీ కోర్సు పూర్తిచేసిన వారు ఏడాది బీఈడీ కోర్సులో చేరేందుకు అనుమతించరు. ఒకవేళ నాలుగేండ్ల డిగ్రీ విద్యార్థి మూడేండ్లకే నిష్క్రమిస్తే ఆ విద్యార్థి రెండేండ్ల బీఈడీ కోర్సులో చేరాల్సి ఉంటుంది.
హైదరాబాద్, ఫిబ్రవరి12 (నమస్తే తెలంగాణ): ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన జేఈఈ మెయిన్స్-1లో రాష్ట్రంలోని ఎస్సీ, బీసీ గురుకులాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈ మేరకు ఆయా సొసైటీలు బుధవారం ఒక ప్రకటన విడుదలచేశాయి. బీసీ గురుకులాల నుంచి 53 మంది ర్యాంకులను కైవసం చేసుకున్నారు.