హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్పార్టీలోకి మహారాష్ట్ర నుంచి వలసలు కొనసాగుతున్నాయి. నాందేడ్, కంధార్-లోహా సభ విజయవంతంతో గులాబీ పార్టీలో జోష్ నెలకొన్నది. ఈ నెల 24న మహారాష్ట్ర నడిగడ్డ ఔరంగాబాద్‌లో సభ నిర్వహించనున్న నేపథ్యంలో మహారాష్ట్ర నేతలు భారీ సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు. గడ్చిరోలి, చంద్రాపూర్, గోండ్వానా, పుణె తదితర ప్రాంతాల నుంచి ఎన్సీపీ, ఎంఎన్ఎస్లాంటి ప్రముఖ పార్టీల నేతలు బీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో మహారాష్ట్ర ఎన్సీపీ సెక్రటరీ దినేశ్ బాబూరావు మడావి పార్టీలో చేరగా, సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.
దినేశ్ బాబూరావు మడావి తండ్రి బాబురావు మడావి మహారాష్ట్రలో గొప్ప నాయకుడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ హయాంలో సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్‌గా పనిచేశారు. గడ్చిరోలి ప్రత్యేక జిల్లాకోసం పోరాడారు. దినేశ్ బాబూరావు మడావికి ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్నది. మడావితోపాటు గిరిజన హకుల సామాజిక కార్యకర్త బోళా శంభాజీ మడావి, పుణె జిల్లా ఎంఎన్ఎస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ సురేశ్ పాటిల్, గోండ్వానా గణతంత్ర పార్టీకి చెందిన ప్రముఖ నేత, చంద్రపూర్ జిల్లాకు చెందిన నేత నామ్‌దేవ్ ఆడే, బంజారా సమాజ్ లీడర్ అతుల్ సతీశ్ రాథోడ్, దళిత సామాజిక నేత వీరేంద్ర పాటిల్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరినీ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.