హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్లో చేరికల పర్వం కొనసాగుతున్నది. బుధవారం సీఎం కేసీఆర్ సమక్షంలో ఎన్సీపీకి చెందిన మరో కీలకనేత బీఆర్ఎస్లో చేరారు. ఔరంగాబాద్, పర్భణీ జిల్లాల్లో పట్టు ఉన్న సీనియర్ రాజకీయ కుటుంబానికి చెందిన యువనేత ‘అభయ్ కైలాస్‌రావు పాటిల్ చికట్గావ్కర్కు బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.
సుదీర్ఘ రాజకీయకుటుంబ నేపథ్యం ఉన్న అభయ్ కైలాస్‌రావు పాటిల్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పర్భణీ పరిసర ప్రాంతాల్లో ప్రజాభిమానం ఉన్న నాయకుడు. అభయ్ కైలాస్‌రావు పాటిల్ తండ్రి కైలాస్ పాటిల్ చికట్గావ్కర్ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలు అందించారు. తాత దిగంబర్‌రావు వాడికర్, చిన్నాన్న భావూ సాహెబ్ పాటిల్ సైతం రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అభయ్ కైలాస్ మేనత్త ఔరంగాబాద్ మాజీ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్‌గా గతంలో పనిచేశారు. ఈ చేరిక సమయంలో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డితోపాటు అభయ్ కైలాస్ పాటిల్ మిత్రులు కూడా ఉన్నారు.
Cmkcr2
విద్యార్థి నాయకుడిగా ఎదిగి
వ్యవసాయ, పారిశ్రామికరంగాలతో మమేకైన అభయ్ కైలాస్ 1998లో ఔరంగాబాద్ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేశారు. 2002 నుంచి 2007 దాకా ఔరంగాబాద్ జిల్లా ప్రాదేశిక సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2006 నుంచి 2010 దాక ఎన్సీపీ యూత్ ఔరంగాబాద్ అధ్యక్షుడిగా, 2013 నుంచి 2016 దాకా ఎన్సీపీ మహారాష్ట్ర యూత్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వాజాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 39 వేల ఓట్లు సాధించారు.