హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి కొత్తగా నవోదయ విద్యాలయాలను ఇచ్చినట్టే ఇచ్చి.. కేంద్రం చేయిచ్చింది. ఆ నవోదయ విద్యాలయాలను ప్రారంభించే విషయంలో ఊసూరుమనిపించింది. విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఆయా విద్యాలయాల్లో అడ్మిషన్లు చేపట్టనేలేదు. దీంతో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం కలగనున్నది. రాష్ర్టానికి కొత్తగా 7 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం 2024 డిసెంబర్ 6న ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్-మలాజిగిరి, మహబూబ్నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ ఏడింటిలో అడ్మిషన్లు కల్పిస్తారని అంతా భావించారు. కానీ విద్యాలయాల మంజూరు అంశం కేవలం కాగితాలకే పరిమితమైంది. క్యాబినెట్ ఆమోదం పొందినా 2024 డిసెంబర్ నుంచి వీటి స్థాపనకు ఒక్క అడుగు ముందుకు పడనేలేదు.
రాష్ట్రంలో ప్రస్తుతం 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లోనే అడ్మిషన్లు కల్పిస్తామని జవహర్ నవోదయ విద్యాలయ సమితి (జేఎన్వీ) తాజాగా ప్రకటన విడుదల చేసింది. కొత్తగా మంజూరైన ఏడు విద్యాలయాల్లో ఇప్పట్లో అడ్మిషన్లు లేనట్టేనని చెప్పేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయాలలో ప్రవేశాలకు ఇటీవలే జేఎన్వీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. జూలై 29 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి విడత పరీక్షను 2025 డిసెంబర్ 13న, రెండో విడత పరీక్షను 2026 ఏప్రిల్ 11న నిర్వహిస్తారు. తెలంగాణ విద్యార్థులకు మొదటి విడతలోనే పరీక్ష జరగనున్నది. 2026 మార్చిలో ఫలితాలను విడుదల చేస్తారు. ఈ జాబితాలో కేవలం 9 పాత నవోదయ విద్యాలయాలే ఉన్నాయి.
560 సీట్లు లాస్
జవహార్ నవోదయ అడ్మిషన్ పొందేందుకు విద్యాలయం ఉన్న జిల్లాలోని విద్యార్థులే అర్హులు. 80 సీట్లుంటే 60 (75శాతం) సీట్లను ఆయా జిల్లాలోని విద్యార్థులకే కేటాయిస్తారు. స్థానికులైన విద్యార్థులే అర్హులు. అది కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులకే ఎక్కువ సీట్లు కేటాయిస్తారు. పట్టణ ప్రాంత విద్యార్థులకు సైతం సీట్లు కేటాయిస్తారు. తాజాగా విడుదలైన అడ్మిషన్ నోటిఫికేషన్లో కొత్తగా ఆమోదించిన ఏడు నవోదయ విద్యాలయాలను చేర్చలేదు. దీంతో ఆ ఏడు జిల్లాల విద్యార్థులు 560 సీట్లు కోల్పోయినట్టే.
కొత్త నవోదయాల కోసం పోరాటం
కొత్త నవోదయ విద్యాలయాల మంజూరుపై తొలుత అంతా హర్షించాం. కానీ ఇప్పుడవి కేవలం కాగితాలపైనే ఉన్నాయి. అడ్మిషన్ నోటిఫికేషన్లో కొత్తవాటిని చేర్చకపోవడం వివక్షాపూరితం. అధికారికంగా విద్యాలయాలను ప్రారంభించి, తాతాలిక భవనాల్లోనైనా తరగతులు ప్రారంభించి అడ్మిషన్లు తీసుకోవాలన్నదే మా డిమాండ్. కొత్త నవోదయ విద్యాలయాలు ప్రారంభించే వరకు తల్లిదండ్రులను ఏకం చేసి పోరాడుతాం.
-కల్యాణి, కాంత్రి కీన్ ఫౌండేషన్
తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ
కొత్త విద్యాలయాల (జేఎన్వీ) స్థాపన విషయంలో కేంద్రం నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనిపిస్తున్నది. ముఖ్యంగా క్యాబినెట్ ఆమోదం తర్వాత కూడా కొత్త విద్యాలయాలు ఏర్పాటు చేయకపోవడం తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపడమే. రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. జేఎన్వీల స్థాపనకు ఆమోదం వచ్చిన వెంటనే విద్యాసంస్థల నిర్మాణం, అధ్యాపకుల నియామకం వంటి ప్రాథమిక ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంటుంది. భారీగా నిధులను మంజూరు చేయించుకోవాలి. కానీ ఎలాంటి ప్రయత్నాలు చేసిన దాఖలాల్లేవు. ఇప్పటికైనా కేంద్రమంత్రులు, ఎంపీలు స్పందించి, చొరవ తీసుకుని ఆయా జిల్లాల్లో విద్యార్థులకు తక్షణమే ప్రవేశ అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కేంద్రం, నవోదయ విద్యాసమితి స్పందించి, కొత్తగా ఆమోదించిన నవోదయ విద్యాలయాలను తక్షణం ప్రవేశ ప్రక్రియలో చేర్చాలని విద్యావేత్తలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రానంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.