హైదరాబాద్, నవంబర్3 (నమస్తే తెలంగాణ): నూతన విద్యావిధానం 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద మంజూరు చేస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదని సమగ్రశిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్‌నికోలస్ హెచ్చరించారు. ఇకపై బిల్లులను డీఈవోలకు సమర్పించాలని స్పష్టం చేశారు. పీఎంశ్రీ పథకానికి ఎంపికైన మల్టీజోన్-1 పాఠశాలలు, గురుకులాల హెచ్ఎంలు, ప్రిన్సిపాల్స్‌కు సోమవారం ఆయన హైదరాబాద్‌లోని ఆదివాసీ భవన్లో ఓరియేటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కేటాయించిన ‘పీఎం శ్రీ’ నిధులు పక్కదారి పడుతుండడంపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో కథనాలు ప్రచురితమవడం, బోగస్ బిల్లులతో నిధులు స్వాహా అవుతుండటం, ఇష్టారీతిన నిధులను ఖర్చుచేయడం తదితర అంశాలపై సమీక్షించారు.
అనంతరం పీఎంశ్రీ పథకం అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఇకపై అన్ని బిల్లులను స్పర్ష్, ఐఎఫ్ఎంఐఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) పోర్టల్ ద్వారా ట్రెజరీకి సమర్పించాలని, ఆమోదించిన పనులకు మాత్రమే నిధులను వినియోగించాలని చెప్పారు. విక్రయదార్లు, వెండర్లకు మాత్రమే బిల్లులు చెల్లించాలని, ఇతరుల వ్యక్తులకు నేరుగా బిల్లులు చెల్లించొద్దని తెలిపారు. జెమ్ తదితర నిబంధనల ప్రకారమే కొనుగోళ్లు ఉండాలని, అనుమతి లేని ఖర్చులకు వాడినా, నిధులను దారిమళ్లించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో మల్టీజోన్-1లోని పీఎంశ్రీ విద్యాసంస్థల ఇంచార్జీలు, సిస్టమ్ అనలిస్టులు, ప్లానింగ్, క్వాలిటీ కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు. మల్టీజోన్-2 సిబ్బందికి మంగళవారం బంజారహిల్స్‌లోని కుమ్రంభీం ఆదివాసీ భవన్లో ఒరియంటేషన్ కార్యక్రమం జరుగనున్నది.