Ambuja Cement | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. మండల కేంద్రానికి 500 మీటర్ల దూరంలోనే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ కంపెనీకి చెందిన 17 ప్లాంట్లు ఉన్నాయి. వీటిల్లో జరిగిన ప్రమాదాలతో పలువురు కార్మికులు మృతి చెందగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. దీంతో కంపెనీలో భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వీటిని చూశాక కూడా మారరా?
సిమెంట్ ఫ్యాక్టరీలతో మనుషులకు ఆరోగ్య సమస్యలు, పర్యావరణానికి హానికరం, ఫ్యాక్టరీల్లో ప్రమాదాలతో వందలాది మంది మృత్యువాతపడుతున్నట్టు, వేలాది మంది క్షతగాత్రులుగా మారుతున్నట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాలు చెప్తున్నాయి. ఏపీలోని జగ్గయ్యపేటలో గత జూలైలో రెండు సిమెంట్ ఫ్యాక్టరీల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు కార్మికులు మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. నిరుడు ఛత్తీస్‌గఢ్‌లోని ఓ సిమెంట్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు, 2022లో గుజరాత్‌లోని మరో సిమెంట్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మరో ముగ్గురు కార్మికులు మృత్యువాతపడ్డారు.
ఫ్యాక్టరీ వద్దంటూ నిరసనలు
తమ ప్రాంతంలో ఫ్యాక్టరీ పెట్టవద్దని పలు రాష్ర్టాల్లో పల్లెవాసులు నిరసనలు చేపట్టారు. ఫ్యాక్టరీ ఏర్పాటుచేసి ఉపాధి కల్పిస్తామన్ననెపంతో భూములు, ఆవాసాలు, ఆరోగ్యాన్ని నాశనం చేయవద్దని మేఘాలయలోని వహైజార్ గ్రామస్థులు ఈ నెల మొదట్లో ఉద్యమాన్ని చేపట్టారు. తమ ప్రాంతంలో నిర్మించాలనుకొన్న మెగాటాప్ కంపెనీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. అస్సాంలోని తాజ్ సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గత జూలైలో పెద్దఎత్తున చేపట్టారు.
మూసీకి ప్రమాద ఘంటికలే
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రామన్నపేట పరిధిలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో మూసీ నదికి ప్రమాద ఘంటికలేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూ.1,400 కోట్లతో ఏర్పాటుకానున్న ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఎకోమెన్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన నివేదికలో ప్రతిపాదిత ప్రాంతం ఉత్తరాన 7.8 కిలోమీటర్ల దూరంలో మూసీ నది హెచ్ఎఫ్ఎల్ ఉన్నట్టుగా పేర్కొన్నారు. అంటే నది దూరంగా ఉన్నందున ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో మూసీకి ఎలాంటి నష్టంలేదని అందులో పేర్కొన్నారు. వాస్తవంగా ఫ్యాక్టరీ కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా, ఆ ప్రాంతం మూసీ పరీవాహక ప్రాంతమేనని నిపుణులు తేల్చిచెప్పారు. ఫ్యాక్టరీ ప్రతిపాదిత ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు అంచెలంచెలుగా చివరికి మూసీలోకి చేరుతుంది. అక్కడి నుంచి కృష్ణా నదిలో కలుస్తుంది.