కాచిగూడ, ఏప్రిల్ 4: రెండు లక్షల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెండురోజుల పాటు చేపట్టే మహాధర్నాను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కేంద్రం బీసీలకు హక్కులను కల్పించకుండా అణచివేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. తొలిరోజు ధర్నాకు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ర్టాల నుంచి వేలాది మంది బీసీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, గుజ్జ సత్యం, భూపేశ్‌సాగర్, వేణుమాధవ్, లాల్‌కృష్ణ, నీల వెంకటేశ్, కే రాము, రాజేందర్, రామకృష్ణ, అనంతయ్య, శ్రీనివాస్, జోషి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.