హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ)/ చిక్కడపల్లి: కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, స్వత్రంత్ర సమాఖ్యలు, వివిధ సంఘాలు బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, 17 డిమాండ్లను నెరవేర్చాలని, 10 గంటల పనిదినాలకు అనుమతినిచ్చిన, తెలంగాణషాప్స్, ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-1988లోని సెక్షన్ 16, 17ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 282ను రద్దు చేయాలని, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన కార్మిక చట్టాలను కేంద్రం రద్దు చేయాలని, రూ. 26 వేలను కనీస వేతనంగా నిర్ధారించాలని, విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను విరమించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయోజనాలను, జేఏసీ కార్మికుల హక్కుల ప్రయోజనాలను కాపాడాలనే డిమాండ్‌తో నేడు సార్వత్రిక సమ్మె చేపట్టనున్నాయి.
భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్(బీఆర్టీయూ) శ్రేణులు సమ్మెలో పాల్గొని విజయవం తం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబు యాదవ్ పిలుపునిచ్చారు. ప్రజలు సమ్మెను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యాలయంలో పిలుపునిచ్చారు. విద్యుత్తు ఉద్యోగులంతా బుధవారం విధులను బహిష్కరించనున్నట్టు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ సాయిబాబ, కన్వీనర్ రత్నాకర్‌రావు, కో కన్వీనర్ బీసీ రెడ్డి పేర్కొన్నారు. సమ్మెను ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని తెలంగాణ ఎంప్లాయి స్ జేఏసీ పేర్కొంది. సార్వత్రిక సమ్మెలో తాము పాల్గొనడం లేదని భారతీయ మజ్దూర్‌సంఘ్(బీఎంఎస్)రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి టీ రాంరెడ్డి ప్రకటనలో తెలిపారు.