నల్లగొండ : మార్చి 28, 29 తేదీలలో 48 గంటల పాటు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం సాయిబాబా తెలిపారు. సోమవారం మిర్యాలగూడలోని మార్కండేయ ఫంక్షన్ హాల్ లో సీఐటీయూ జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి వంగూరు రాములుతో కలిసి మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, కేంద్ర బడ్జెట్ లో కార్మికులకు తీరని అన్యాయం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా 48గంటల సమ్మె నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమ్మెకు అన్ని జాతీయ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు అప్ప చెపుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు.
నిత్యావసర వస్తువుల ధరలను పెంచి కార్పొరేట్ శక్తులకు ఇచ్చే సబ్సిడీలను పెంచుకుంటూ సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు డబ్బీకార్ మల్లేష్, జిల్లా నాయకులు సత్తయ్య, ప్రమీల, సలీం, పరిపూర్ణ చారి, అవుతా సైదులు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.