సంగారెడ్డి నవంబర్ 18(నమస్తే తెలంగాణ)/కొడంగల్: లగచర్ల ఘటన వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నదని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ అభిప్రాయపడ్డారు. సోమవారం వచ్చిన ఆయన బృందం లగచర్ల బాధిత గ్రామాల్లో పర్యటించి, బాధితుల గోడు విన్నది. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలులో ఉన్న లగచర్ల బాధిత రైతులను ఆయన పరామర్శించారు. అనంతరం సెంట్రల్ జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు. లగచర్ల ప్రాంతంలోని కొందరు తమకు ఓటేయలేదని ఓ రాజకీయ పార్టీ కుట్రపూరితంగా అమాయకులను ఇబ్బందులు పెడుతున్నదని చెప్పారు. సీఎం అన్న తిరుపతిరెడ్డి తమను బెదిరించారని బాధితులు తనతో చెప్పినట్టు వివరించారు. దుద్యాల ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత శేఖర్ ఎస్టీలను బెదిరించినట్టు చెప్పారు.
ఈ ఘటనలో 60 మందిని అర్ధరాత్రి అరెస్టు చేశారని, బాధితులను హింసించినట్టు తెలిపారు. స్థానిక లీడర్లు తమకు అనుకూలమైన వారిని తప్పించాలని పెద్ద లీడర్లకు చెప్తే పోలీసులు వారిని తప్పించి అమాయకులైన వారిని అరెస్టు చేసి జైలుకు పంపారని చెప్పారు. అసలైన నేరస్తులు జైలు బయటే ఉన్నారని తెలిపారు. సీఎం నియోజకవర్గంలో ఉన్నామని కొంతమంది అధికారులు, పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని తెలిపారు. తనపై దాడి జరగలేదని కలెక్టరే స్వయంగా చెప్పారని తెలిపారు.
వీడియోలో కనపడ్డారని అందరినీ అరెస్టు చేస్తే ఎలా? అని పోలీస్ అధికారులను ప్రశ్నించారు. లగచర్ల ఘటనలో తప్పుచేసిన అధికారులను అరెస్టు చేయిస్తామని హెచ్చరించారు. అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులను బదిలీ చేయాలని సీఎస్, డీజీపీకి సూచించామని తెలిపారు. ఫార్మా సిటీ పనులు పూర్తిగా నిలిపివేయాలని 10 రోజుల్లో లగచర్ల ఘటన పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు సూచించినట్టు హుస్సేన్ నాయక్ వెల్లడించారు.
లగచర్ల ఘటనలో జైలుపాలైన వారంతా అమాయకులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు తన విచారణలో తేలిందని ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ చెప్పారు. జైలులో ఉన్న ప్రతి రైతు ఘటన గురించి వివరించారని, అందుకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. జైలులో ఉన్న వారిలో ఒక్కరు కూడా లగచర్ల ఘటన జరిగినప్పుడు లేరని, పోలీసుల తీసిన వీడియోల్లో కూడా లేరని తెలిపారు. ఘటనా సమయంలో ఒకరు కాలేజీలో ఉండగా మరొకరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నారని తెలిపారు. రాఘవేందర్ అనే ప్రభుత్వ ఉద్యోగి తన ఆఫీసులో ఉండగా కొందరు పొలాల్లో ఉన్నట్లు చెప్పారని తెలిపారు. గొడవతో సంబంధంలేని అమాయకులను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.
జైలులో ఉన్నవారంతా తమ భూములను వదిలేదిలేదని తేల్చి చెప్పారని వివరించారు. తండాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, మహిళలు మాత్రమే చిన్నపిలలను పెట్టుకొని భయం గుప్పిట్లో బతుకుతున్నారని తెలిపారు. ఈ దశలో లగచర్లతోపాటు సమీప గ్రామాల్లోకి పోలీసులు వెళ్లవద్దని తాను ఆదేశించినట్టు చెప్పారు. అరెస్టులను వెంటనే నిలిపివేయాలని, అక్రమంగా అరెస్టు చేసిన ప్రతి ఒక్కరినీ విడుదల చేయాలని ఆదేశించారు. మళ్లీ అరెస్టులకు ప్పాడితే కమిషన్ పరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. లగచర్ల బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తామని హుస్సేన్ నాయక్ స్పష్టంచేశారు. పోలీసులు చర్యలు ఆపకపోతే చర్య తప్పదని, ఢిల్లీకి రప్పిస్తామని హెచ్చరించారు.