Jajula Srinivas Goud | హైదరాబాద్ సిటీబ్యూరో, రవీంద్రభారతి, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. జనాభాలో 60శాతమున్న బీసీలకు 2, 6శాతం జనాభా కలిగిన రెడ్లకు సీఎం సహా 4 మంత్రి పదవులు కట్టబెట్టడమేంటని ప్రశ్నించారు. కనీసం విస్తరణలోనైనా బీసీలకు న్యాయం చేయకపోతే కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాబినెట్ విస్తరణపై చర్చించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఢిల్లీ వెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నదని అన్నారు. భట్టివిక్రమార్క బడుగు బలహీనవర్గాలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడకుండా ప్రేమ్‌సాగర్‌రావుకు మంత్రిపదవి కట్టబెట్టేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కులగణన నిర్వహించాలని, జనాభా దామాషా ప్రకారం పదవుల్లో అవకాశం కల్పించాలని మాట్లాడే రాహుల్‌గాంధీ తెలంగాణలో ఆ సామాజిక న్యాయం పాటించాలని డిమాండ్ చేశారు. బీసీల్లోని చాలా వర్గాలకు ఇప్పటివరకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని అన్నారు. నామినేటెడ్ పోస్టులు, సలహాదారుల నియామకాల్లోనూ సామాజిక న్యాయం పాటించాలని కోరుతూ త్వరలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే, అగ్రనేత రాహుల్‌కు లేఖ రాస్తామని చెప్పారు.
బీసీకులాల జేఏసీ కన్వీనర్ బాలగోని బాలరాజుగౌడ్ మాట్లాడుతూ ఎక్సైజ్‌శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు గౌడ కులస్తులపై దాడులను పాల్పడుతున్నారని, వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దాడులు ఆపకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పకతప్పదని హెచ్చరించారు. సమావేశంలో బీసీ కుల సంఘాల ప్రతినిధులు గణేష్‌చారి, విక్రమ్‌గౌడ్, విజయ్‌కుమార్‌గౌడ్, మల్లయ్య, విద్యార్థి, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు.