హనుమకొండ చౌరస్తా : వచ్చే జనవరిలో జాతీయస్థాయి సీనియర్ ఖోఖో (National level Kho Kho ) పోటీలు కాజీపేటలో ( Kazipet) నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిషన్ కన్వీనర్ జంగా రాఘవరెడ్డి (Janga Raghav Reddy) అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఖో ఖో సంఘం ఆధ్వర్యంలో సౌత్‌జోన్ ఖో ఖో నేషనల్లో పాల్గొనే తెలంగాణ మహిళా, పురుషుల జట్ల ఎంపిక హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించారు.
ఈ ఈసందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొని ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఖోఖో క్రీడాకారులకు, ఖోఖో అభివృద్ధికి గత 15 సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేస్తున్నామని, తగిన సౌకర్యాలు అత్యున్నతస్థాయిలో కల్పిస్తున్నామని వెల్లడించారు. దానికి అనుగుణంగానే దేశంలో తెలంగాణను ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.
ఎంపికైన క్రీడాకారులు తెలంగాణ పక్షాన కర్ణాటకలో జరిగే దక్షిణ భారత జాతీయస్థాయి ఖోఖో క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం వరంగల్ కరీమాబాద్‌కు చెందిన నవ్యశ్రీ అండర్-18 కేటగిరిలో 2025-26 సంవత్సరానికిగాను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ శిబిరానికి ఎంపికై ప్రస్తుతం గుజరాత్‌లోని సాయి సెంటర్లో శిక్షణ పొందుతున్న ఆమెను జంగా రాఘవరెడ్డి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనాతి కృష్ణమూర్తి, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్, హనుమకొండ జిల్లా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పి.సురేష్‌బాబు, పెటా టీఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల కార్యదర్శులు, తెలంగాణ ఖో ఖో సంఘ బాధ్యులు ఉమ్మడి వరంగల్ జిల్లా ఖోఖో సంఘం బాధ్యులు, తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల నుంచి సుమారు 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.