మోర్తాడ్, జూన్ 15 : యూరియా ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే గద్దె దిగిపోవాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియ్ యాప్ విధానాన్ని నిరసిస్తూ సోమవారం రైతులు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని దొన్కల్ ఎక్స్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఉదయం 9.45 గంటలకు చేపట్టిన రాస్తారోకో మధ్యాహ్నం 12 వరకు కొనసాగింది. ఇందులో దొన్కల్, ధర్మోరా, శెట్పల్లి గ్రామాల రైతులు పాల్గొని యూరియా యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యాప్ ద్వారా యూరియా దొరుకడం లేదని, పంటలకు సమయానికి యూరియా వేయలేని పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. మండలానికి ఒక యూనిట్‌గా తీసుకోవడంతో తమ గ్రామంలో యూరియా ఉన్నా తమకు దొరుకని పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిమిషాల వ్యవధిలో స్టాక్ జీరోగా చూపిస్తున్నదని, ఇక యాప్ లేని వారి పరిస్థితి, యాప్‌ను వినియోగించే విధానం తెలియని వారి పరిస్థితి మరీ దారుణంగా ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
రుణమాఫీ, రైతుబంధు ఇవ్వడం చేతనైతలేదని, కనీసం యూరియా కూడా ఇవ్వడం చేతకాకపోతే రేవంత్‌రెడ్డి గద్దెదిగిపోవాలని, ప్రభుత్వాన్ని తామే నడిపించుకుంటామని రైతులు మండిపడ్డారు. యాప్‌ను రద్దు చేయడంతోపాటు ప్రతి గ్రామంలో యూరియా అందుబాటులో ఉంచి ఎకరానికి 4 బస్తాల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏవో హరీశ్‌కుమార్, ఇన్చార్జి తహసీల్దార్ అచ్యుతరెడ్డి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడినా, కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమించబోమని స్పష్టం చేశారు. ఆర్మూర్ సబ్‌కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడారు. యాప్ ద్వారా తలెత్తుతున్న ఇబ్బందులను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు. మంగళవారం వరకు యూరియా తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. యూరియా రాకపోతే మళ్లీ ఆందోళన చేపడుతామని రైతులు హెచ్చరించారు.