హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ డైరెక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఈ నెల 26, 27న నిర్వహించే ‘నేషనల్ దళిత్ సమ్మిట్’లో ఈ డిమాండ్‌ను ప్రతిపాదిస్తామని తెలిపారు. నేషనల్ దళిత్ సమ్మిట్‌కు సన్నాహకంగా మంగళవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. నేషనల్ దళిత్ సమ్మిట్‌కు వివిధ రాష్ర్టాల మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులతోపాటు 26 రాష్ర్టాల నుంచి 80 సంఘాలకు చెందిన 300 మందికిపైగా ప్రతినిధులు హాజరుకానున్నట్టు లక్షయ్య వెల్లడించారు. వ్యవసాయ కూలీలకు ‘కూలీబంధు’ ఇవ్వాలని అజెండాలో పొందుపరుస్తామని, డిసెంబర్లో మరోసారి తమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన నాటి కంటే నేటి రోజుల్లోనే దళితులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను బీజేపీ నాయకులు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, వారి మ్యానిఫెస్టోల్లో దళితులకు చోటు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. దళితుల సంక్షేమం కోసం బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కొత్త పథకాలను ప్రవేశపెట్టకపోగా పాత పథకాలనే ఎత్తివేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో దళితుల సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తామని, ఇందుకోసం తమతో కలిసొచ్చే వారిని ఆహ్వానిస్తున్నామని లక్షయ్య తెలిపారు. దళితుల హక్కులపై మోదీ ప్రభుత్వం చేస్తున్న దాడిని అందరూ తిప్పికొట్టాలని ఏఐఏడబ్ల్యూయూ ఆలిండియా జనరల్ సెక్రటరీ బీ వెంకట్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దళిత నాయకులు టీ స్కైలాబ్‌బాబు, ఆర్ వెంకట్రాములు, ఎం అనిల్‌కుమార్, సాయిబాలాజీ, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.