హైదరాబాద్, నవంబర్ 8: (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక సిటీ కళాశాల శతాబ్ది వేడుకల్లో భాగంగా అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 10, 11 తేదీల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ- అవకాశాలు, సవాళ్లపై శాస్త్రీయ విశ్లేషణ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాలభాస్కర్ తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి, ఐసీఎస్ఎస్ఆర్ సౌజన్యంతో జరిగే సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, గౌరవ అతిథులుగా కళాశాల విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి, ప్రధానవక్తగా తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ హాజరవుతారని పేర్కొన్నారు.
రెండు రోజుల సదస్సులో రాష్ట్ర వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ, వస్తూత్పత్తి, ఎగుమతి రంగాల్లో జరుగుతున్న కృషి, ప్రస్తుత స్థితిగతులపై ఆయా శాఖల ప్రభుత్వ కార్యదర్శులు ఎం రఘునందన్‌రావు (వ్యవసాయం), జీఆర్ రెడ్డి (ఫైనాన్స్), రోనాల్డ్ రోస్ (ఫైనాన్స్), విష్ణువర్ధన్‌రెడ్డి (విదేశీ పెట్టుబడులు), జగన్మోహనరావు (బ్యాంకింగ్) తదితరులు ఆరు టెక్నికల్ సెషన్స్‌లో మాట్లాడతారన్నారు. పలు వర్సిటీలు, కళాశాలల నుంచి 40 మందికి పైగా ఆర్థికశాస్త్ర ఆచార్యులతోపాటు, వాణిజ్య, గణిత, భౌతిక శాస్త్రఆచార్యులు కూడా పత్ర సమర్పణ చేస్తారని ఆయన వివరించారు.