హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): శాసనసభ ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించి ఉపకులాల వారీగా అమలు చేయాలని, సంచార కులాలకు ప్రత్యేకంగా 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వివిధ బీసీ కులాలకు ప్రత్యేక ఆర్థిక కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని విన్నవించారు. తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా బీసీలకు మేలు చేసేలా రూపొందించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కుల గణనను నిర్వహించి, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఏడాదే ఆ పనిని పూర్తి చేస్తే బీసీలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.