హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్యకు జాతీయ అవార్డు లభించింది. సహకార బ్యాంకుల క్యాటగిరీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏకైక అవార్డు ఇదే. ‘పీఎం స్వనిధి’ పథకం ప్రారంభమై మూడేండ్లయిన సందర్భంగా గురువారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి చేతుల మీదుగా స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించడంలో ఇప్పటికే తెలంగాణ మున్సిపల్ శాఖ అవార్డు సాధించగా.. సహకార బ్యాంకు విభాగంలో స్త్రీనిధి అవార్డు దక్కించుకున్నది.
స్త్రీనిధి ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 40,795 మంది వీధి వ్యాపారులకు రూ.59.20 కోట్ల రుణాలను అందజేశారు. వారి అవసరాన్ని బట్టి ఒకొక్కరికి రూ.10 నుంచి రూ.50 వేల వరకు ఇచ్చారు. ఎక్కువ రుణాలను పొందిన జిల్లాలుగా మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు నిలిచాయి. స్త్రీనిధికి జాతీయ స్థాయి అవార్డు లభించడంపై ఎండీ విద్యాసాగర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నో సహకార బ్యాంకులున్నా స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య అగ్రస్థానంలో నిలిచి ఈ అవార్డును కైవసం చేసుకోవడం తమ బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. మున్ముందు మరింత ఉత్సాహంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణంగా నిలుస్తామని, ప్రభుత్వ సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.