హైదరాబాద్, నవంబర్ 26(నమస్తే తెలంగాణ)ః నిర్మాణాల్లో భద్రతా ప్రమాణాలను అమలు చేసినందుకు తెలంగాణ రోడ్లు-భవనాల శాఖ(ఆర్అండ్బీ)శాఖకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఈ మేరకు నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్సీఐ) ప్రకటించిన జాతీయ భద్రతా అవార్డుకు రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ ఎంపికైంది. వరంగల్ జిల్లా రంగంపేటలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ, కార్మిక భద్రత చర్యలు సమర్థంగా అమలు చేసినందుకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు-భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా నాణ్యత, భద్రత, స్థిరత్వం కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.