హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కార్యాచరణను అమలు పరుస్తున్న తెలంగా ణ రాష్ట్రం వైపు రైతు ప్రపంచం ఆశ్చర్యంతో చూస్తున్నది. రాష్ట్రంలో దండుగగా మారిన వ్యవసాయం సీఎం కేసీఆర్ దార్శనికతతో అనతికాలంలోనే పండుగైంది. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, రైతుసంక్షేమ పథకాలు తమకూ కావాలని ఇతర రాష్ర్టాల రైతుల నుంచి డిమాండ్లు రోజురోజు కూ పెరుగుతున్నాయి.
సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రెండు పంటలకు పుషలమైన నీరివ్వడం, రైతుబంధు ద్వారా పంటసాయం, రైతు కుటుంబాల్లో భరోసాను నింపే రైతు బీమాతోపాటు 24 గంటల నాణ్యమైన నిరంతరాయ ఉచిత విద్యుత్తును అందించడంతోపాటు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్న తెలంగాణపై దేశ రైతాంగం ఆసక్తిని కనబరుస్తున్నది. ఇప్పటికే దేశంలోని వ్యవసాయ రంగ నిపుణులు, ఆర్థికరంగ నిపుణులు, ఆదర్శ రైతులు తెలంగాణాను సందర్శించి ఇక్కడి వ్యవసాయ విధానాలను అధ్యయనం చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయ, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేసేందుకు దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి సుమారు 100మందికి పైగా రైతుసంఘాల నాయకులు, ప్రతినిధులు పర్యటిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్నవారు.. మూడు రోజులపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా.. కేవలం ఎనిమిదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్న విషయాన్ని తెలుసుకుని రాష్ట్ర పర్యటనకు వచ్చామని వారు తెలిపారు.