Koppula Eshwar : తాడిచెర్ల బ్లాక్–2ను సింగరేణికి తామే కేటాయించామని బీజేపీ–కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరతీశారని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) తీవ్రంగా విమర్శించారు. సింగరేణిలో జరుగుతున్న అక్రమాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకే తాడిచెర్ల బ్లాక్–2ను కేటాయించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రకటించారనే అనుమానాలు కలుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను కాపాడేందుకు బీజేపీ కేంద్ర మంత్రులు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కొప్పుల అన్నారు. తాడిచెర్ల బ్లాక్–2 మాత్రమే కాదు, మిగిలిన అన్ని బొగ్గు బ్లాక్లను కూడా సింగరేణికే కేటాయించాలని బీఆర్ఎస్, టీబీజీకేఎస్ డిమాండ్ చేస్తున్నాయని మాజీ మంత్రి స్పష్టం చేశారు.
గనులను టెండర్ల ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని తీసుకువచ్చిన పాపం కాంగ్రెస్, బీజేపీలదేనని కొప్పుల ఈశ్వర్ దుయ్యబట్టారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల భవిష్యత్తు కోసం తెలంగాణలోని అన్ని బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించాలని కార్మికుల పక్షాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. సింగరేణి హక్కులు, కార్మికుల ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితులలోనూ రాజీ పడేది లేదని కొప్పుల స్పష్టం చేశారు.

తాడిచర్ల బ్లాక్ 2ను సింగరేణికి కేటాయించడం ద్వారా 277 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు వెలికి తీసే అవకాశం ఏర్పడిందని, సుమారు 1400 మంది శాశ్వత కార్మికులకు పనిచేసే అవకాశం దక్కుతుందని మాజీ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తాడిచర్ల బొగ్గు నిల్వలను మొదట సింగరేణి సంస్థనే గుర్తించిందని, తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బొగ్గు గనులపై, జీఎం కార్యాలయాల ఎదుట నల్ల బ్యాడ్జీలతో పలుమార్లు నిరసన పోరాటాలు చేశారని కొప్పుల ఈశ్వర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, టీజీబీకేఎస్ కార్మిక నాయకులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ మంత్రులు, ఉన్నతాధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించామని కొప్పుల తెలిపారు. సింగరేణి సంస్థ పరిరక్షణకు కార్మికుల ఉపాధి అవకాశాల కల్పనకు బీఆర్ఎస్, టీజీబీకేఎస్ నిరంతరం కృషి చేస్తున్నాయని చెప్పిన ఆయన.. తెలంగాణలోని బొగ్గు గనుల వేలంపాటలో పాల్గొనాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏఐటియూసీ ఐఎన్టీయూసీ సంఘాలు కోరాయని వెల్లడించారు.
వేలంపాటలో పాల్గొంటేనే బొగ్గు బ్లాకులు దక్కుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పదేపదే ప్రకటించారని, కేంద్ర మంత్రులు కూడా ఇదే విషయాన్ని ప్రచారం చేస్తూ వచ్చారని కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మాత్రం వేలం పాట లేకుండానే అనుభవం దృష్ట్యా బొగ్గు బ్లాక్లను సింగరేణికి ఇవ్వాలని నిరంతరం పోరాడిందని మాజీ మంత్రి గుర్తు చేశారు. బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నేతృత్వంలో జరిగిన కార్మిక పోరాటాల విజయమే తాడిచెర్ల బొగ్గు బ్లాకు కేటాయింపు అని కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.