శివ్వంపేట, ఆగస్టు 24 : దేశానికి అన్నం పెట్టే రైతును అడుక్కునే స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుస్తున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా శివ్వంపేటలో ఆదివారం రైతులు యూరియా కోసం ఇటుకలు, చెప్పులు క్యూలో పెట్టి అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఆమె అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. చిన్నపిల్లలను ఎత్తుకొని మహిళా రైతులు క్యూలో ఉండగా వారితోనూ మాట్లాడి మంచినీళ్ల బాటిళ్లను అందజేశారు. రైతులతో అక్కడే నర్సాపూర్-తూప్రాన్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు పంటలు కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
అప్పులు చేసి నాట్లు వేసుకుంటే యూరియా లేక పనులన్నీ మానుకొని రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి నెలకొన్నదని అన్నారు. ఒక్కో రైతుకు ఒక్క బస్తా మాత్రమే యూరియా ఇస్తే పంట దిగుబడి ఎలా వస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేక ఆ నెపాన్ని కేంద్రం మీద నెట్టివేయడం.. బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం మీద నింద మోపడం పరిపాటిగా మారిందని విమర్శించారు. విషయం తెలుసుకున్న ఎస్సై మధుకర్‌రెడ్డి తన సిబ్బందితో వచ్చి వారితో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. అంతకుముందు ఎమ్మె ల్యే అధికారులతో ఫోన్లో మాట్లాడి సోమవారం మరో రెండు లారీల యూరియా అందించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.