Etela Rajender | హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీని బొంద పెట్టాలని చూస్తున్నారని నర్సాపూర్ నియోజకవర్గ నేత సింగాయపల్లి గోపి ఆరోపించారు. నర్సాపూర్ టికెట్‌ను మురళీయాదవ్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ గోపి, ఆయన అనుచరులు సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ధర్నా చేశారు. భూకబ్జాలు చేసిన వ్యక్తికి, బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసినవారికి టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. కష్టపడే కార్యకర్తలను వదిలి, దొంగలకు టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు.
అభ్యర్థిని ప్రకటించి పది రోజులైనా నర్సాపూర్‌లో కనీసం ప్రచారం మొదలుపెట్టలేదని, అదేమని అడిగితే ‘పైనుంచి రావాల్సినవి అందలేదు’ అని చెప్తున్నారని, ఏం అందుతాయో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల పార్టీలో చేరినప్పటి నుంచే ఆధిపత్యపోరు మొదలైందని, బీజేపీని హోల్‌సేల్‌గా అమ్మాలని చూస్తున్నారని ఆరోపించారు. గోపి ధర్నా చేస్తున్న సమయంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రాష్ట్ర కార్యాలయానికి వచ్చినప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం.