చారకొండ, డిసెంబర్ 20 : డిండి-నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న రిజర్వాయర్ ముంపు నుంచి తమ గ్రామాలను కాపాడాలని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండావాసులు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి పట్టదా..? అని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్‌నాయక్ నిలదీశారు. సర్కారు దిగి రాకుంటే లగచర్ల మాదిరిగానే ఇక్కడి ప్రజలు కూడా తిరగబడుతారని హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం ఎర్రవల్లిలో చేపట్టిన దీక్షలను రాంబాల్‌నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథం నాయక్, జిల్లా అధ్యక్షుడు దేవీలాల్ చౌహాన్ సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోకారం వద్ద నిర్మించనున్న రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి.. ఎర్రవల్లి, ఎర్రవల్లితండాలను ముంపు నుంచి కాపాడాలని కోరారు. ఈ రెండు ప్రాంతాల్లో కాల్వల కోసం పేదల నుంచి బలవంతంగా భూసేకరణ చేసిన తర్వాత రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం జీవో విడుదల చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి సొం తూరు పక్కనున్న ఎర్రవల్లివాసులు గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుకూడా లేదని ఎద్దేవాచేశారు. నిర్వాసితుల పక్షాన గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందించి న్యా యం జరిగేలా చూస్తామని చెప్పారు.