హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఈ నెల 27న నిర్వహించనున్న ప్రగతి సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ఆ ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదితర అంశాలపై ఈ భేటీలో సమీక్షించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం బేసిన్‌లోని రాష్ర్ర్టాలకు తెలియజేసింది. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి 41.67 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసుకునేలా కేంద్రం గతంలో నిర్ణయించింది.
2027 చివరినాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. తొలిదశ నీటి నిల్వ కోసం 15,277.84 ఎకరాల మేర భూసేకరణ చేపట్టాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టులో 41.67 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వచేస్తే తెలంగాణలోని 6 మండలాల్లో 954 ఎకరాలు ముంపునకు గురవుతాయి. భద్రాచలం టౌన్‌తోపాటు మణుగూరులోని భారజల (హెవీ వాటర్) ప్లాంట్‌కూ ముంపు ముప్పు పొంచి ఉన్నది.
దీనితోపాటు కిన్నెరసాని, ముర్రేడువాగు, మరో ఆరేడు స్థానిక వాగుల్లో డ్రైనేజీ తీవ్రత ఎకువ అవుతుందన్న ఆందోళన ఉన్నది. దుమ్మగూడెం ప్రాజెక్టు కింద 36 వాగులు వచ్చి చేరుతుండటంతో పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వాటి డ్రైనేజీ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఈ క్రమంలో ముంపుపై కచ్చితమైన సర్వే నిర్వహించి, డీమారేషన్ చేయించాలని తెలంగాణ పట్టుబడుతున్నది. కానీ, ఏపీ మాత్రం జాయింట్ సర్వేకు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలు కూడా పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
వాస్తవానికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మే 28న జరగాల్సిన ప్రగతి సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించాల్సి ఉన్నది. కానీ, ఆ సమావేశాన్ని జూన్ 25కు వాయిదా వేశారు. చివరి నిమిషంలో ఆ సమావేశ ఎజెండా నుంచి పోలవరం అంశాన్ని తొలగించారు. తాజాగా ఆ సమావేశాన్ని ఈ నెల 27న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపైనే కాకుండా హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు సంబంధించిన అంశాలపై కూడా ప్రధాని సమీక్షించనున్నారు. దీన్‌దయాల్ అంత్యోదయ యోజన రూరల్ లైవ్లీ హుడ్ మిషన్, వ్యవసాయ ప్రాథమిక సహకార కేంద్రాల కంప్యూటరీకరణ, స్కూల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి పీఎం శ్రీ పథకాలపై కూడా ప్రగతి సమావేశంలో చర్చించనున్నారు.