హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) రాష్ట్ర పర్యటనకు వ్యతిరేకంగా శనివారం చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త నిరసనలను విజయవంతం చేయాలని సీపీఐ(Cpi)(ఎం)రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. తెలంగాణకు వివిధ సందర్భాల్లో చేసిన వాగ్ధానాలు, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన హక్కులను, వాటాలను ఇవ్వడం లేదని ఆరోపించారు.
సింగరేణి(Singareni)లో మరోసారి బొగ్గుగనుల వేలానికి కేంద్రం నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. సింగరేణి లాంటి సంస్థలతో పాటు, కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ కార్పొరేట్(Corporate) శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రపన్నుతున్నదని అన్నారు. బయ్యారం ఉక్కు, గిరిజన, హర్టికల్చర్ యూనివర్సిటీలు, ఎన్టీపీసీ(NTPC) విద్యుత్ కేంద్రం, ఖాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఊసే ఎత్తడంలేదని మండిపడ్డారు.
యూపీఏ హయంలో మంజూరైన ఐటీఐఆర్(ITIR)ను రద్దుచేసిందని తెలిపారు. కృష్ణా నదీజలాల పంపిణీ పంచాయితీపై రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటుచేసి రెండు నదులను తన పరిధిలోకి తీసుకోవడం దారుణమని ఆరోపించారు. గిరిజన, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 8న తెలంగాణ రాకను వ్యతిరేకించాలని ఆయన కోరారు.