హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): పోడు భూములు.. తెలంగాణతో పాటు అనేక రాష్ర్టాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. దీనికి శాశ్వత పరిష్కారం చూపేది కేంద్రమే. కానీ, చట్ట సవరణకు నరేంద్రమోదీ సర్కారు ముందుకు రావటం లేదు. ఫలితంగా ఏండ్లుగా ఈ సమస్యతో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. పోడు రైతుల సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ సర్కారు తీవ్రంగా కృషి చేస్తున్నది. ఇందులో భాగంగానే పోడు వ్యవసాయం చేస్తున్న రైతుల వివరాలను సేకరించే ప్రక్రియ ప్రారంభించి దరఖాస్తులను స్వీకరించింది. 28 జిల్లాలు 37 మండలాలు 3041 గ్రామపంచాయతీల పరిధిలో సుమారు 12.60 లక్షల ఎకరాల పోడు భూముల్లో సుమారు 3,95,000 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నట్టు గుర్తించింది. వీరిలో 62% గిరిజనులు, 38% గిరిజనేతరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ అటవీహకుల చట్టం-2006 ఆధారంగా ఉమ్మడి ఏపీలో 2008లో సుమారు 96,600 మందికి 3,08,000 ఎకరాల భూమిపై హకు లభించింది. అయితే పోడు వ్యవసాయం చేస్తున్న కొందరికి భూ హకులు దక్కలేదు. ఈ సమస్య తీరాలంటే కేంద్రం చట్ట సవరణ చేయాలి. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 నాటికి పోడు వ్యవసాయం చేసుకొంటున్న రైతులకు మాత్రమే హకులు కల్పించే అవకాశం ఉన్నది. అదీ గిరిజనులకు మాత్రమే. గిరిజనేతరులు మాత్రం 75 ఏండ్లుగా తాము పోడు వ్యవసాయం చేసుకొంటున్నట్లు ఆధారాలు చూపించాలి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ గిరిజనేతరులకు పోడు భూములపై హకులు రాలేదు.
కటాఫ్ తేదీని మార్చితేనే..
తెలంగాణలో పోడు భూముల హకుల కోసం దరఖాస్తు చేసుకొన్న సుమారు 3,95,000 మందికి ప్రయోజనం కలగాలంటే డిసెంబర్ 2005 కటాఫ్ తేదీని మార్చాల్సి ఉంటుంది. గిరిజనేతరులకు పోడు హకులు దకాలంటే 75 ఏండ్ల పాటు వ్యవసాయం చేస్తున్నట్టు సాక్ష్యాధారాలు చూపించాలన్న నిబంధనను తొలగించాలి. ఈ రెండు అంశాలు కూడా సంపూర్ణంగా కేంద్రం పరిధిలోనివే. అర్హులైన పోడు రైతులను ఎంపిక చేయడం, దరఖాస్తుల స్వీకరణ, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అంతిమంగా వారికి హకులు కల్పించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయింది.
కేంద్రం నుంచి తిరస్కరణలే!
పోడు భూముల చట్ట సవరణకు తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాలూ కేంద్రానికి విన్నవించాయి. అయితే, సవరణలకు అవకాశమే లేదని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ చెప్తున్నది. తెలంగాణ అభ్యర్థనను తిరసరిస్తున్నట్టు కేంద్ర మంత్రి అర్జున్ ముండా సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయాన్ని తీసుకొని కటాఫ్ తేదీని మార్చితేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.