హైదరాబాద్ సిటీబ్యూరో/ కొండాపూర్ ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ మేటిగా నిలుస్తుందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రశంసించారు. మెరుగైన రవాణా వ్యవస్థతోపాటు వినోదం, నివాస సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. నేషనల్ రియల్ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎన్ఏఆర్ఈడీసీవో) సిల్వర్‌జూబ్లీ (25వ వార్షిక) వేడుకలు, నేషనల్ రియల్ఎస్టేట్ కాంక్లేవ్-2023ను శనివారం మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వెంకయ్యనాయుడు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రియల్ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, కొనుగోలుదారులకు సంతృప్తినిచ్చేలా ఇండ్ల నిర్మాణాలు కొనసాగించాలని సూచించారు. ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్పగా మన పూర్వీకులు నిర్మించిన కట్టడాలను ఆదర్శంగా తీసుకుని ప్రకృతికి ఇబ్బంది కలగకుండా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. సౌకర్యం, సౌందర్యాల కలయికతో నిర్మాణాలు ఉండాలని అభిలషించారు.
కేసీఆర్ కృషితోనే సేఫెస్ట్ సిటీగా..
తెలంగాణలో శతాబ్ది కాలంలో జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ది కాలంలోనే జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వివరించారు. 77 ఏండ్ల్ల స్వతంత్ర భారత్‌కు మార్గదర్శిగా, దిక్సూచిగా తొమ్మిదేండ్ల తెలంగాణ మారిందని చెప్పారు. విజనరీ లీడర్ సీఎం కేసీఆర్ కృషితోనే అత్యంత సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్ మహానగరం అవతరించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవ, ప్రభుత్వ పాలసీలతో ప్రపంచ వ్యాపార దిగ్గజ సంస్థలు వస్తున్నాయని, హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గదామంగా మారిందని వివరించారు. మంత్రి కేటీఆర్ చొరవతో చేపట్టిన ఎస్సార్డీపీ ద్వారా నగరంలో రవాణా వ్యవస్థ ఎంతో మెరుగుపడిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ రూరల్ ఎకానమీ గణనీయ పురోగతి సాధించిందని, ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రియల్ఎస్టేట్రంగం విస్తరిస్తున్నదని, టీఎస్ బీపాస్ ద్వారా 21 రోజుల్లోనే భవన నిర్మాణ అనుమతులు లభిస్తున్నాయని వివరించారు. వ్యవసాయ రంగాన్ని మెరుగైన స్థితిలో నిలబెట్టేందుకు అవసరమైన ఇరిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ‘వరల్డ్ లార్జెస్ట్ మల్టీలెవల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏది?’ అని గూగుల్‌లో సెర్చ్ చేయాలని మంత్రి కోరగా.. ఢిల్లీకి చెందిన బిజినెస్మెన్ సెర్చ్ చేసి, ‘కాళేశ్వరం ప్రాజెక్ట్’ అని బదులిచ్చారు. దీంతో సమావేశంలో పాల్గొన్నవారంతా కరతాళధ్వనులు చేశారు.
ఊహించనంత అభివృద్ధి: హీరానందానీ
తెలంగాణ దేశంలోనే అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందిందని, ఊహించని స్థాయిలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని భారత నిర్మాణ దిగ్గజం నిరంజన్ హీరానందానీ ప్రశంసల జల్లు కురిపించారు. తాగునీరు, విద్యుత్తు, ఐటీ, పారిశ్రామిక రంగం, రహదారులు, శాంతిభద్రతలు ఇలా ప్రతి అంశంలోనూ ఊహించని రీతిలో రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారని కితాబిచ్చారు. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చానని, అద్భుతంగా నగరాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్, నరెడ్కో జాతీయ అధ్యక్షుడు రాజన్ బందేల్కర్, నరెడ్కో ప్రతినిధులు హరిబాబు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.