హైదరాబాద్/చిక్కడపల్లి, డిసెంబర్ 13 (నమస్తేతెలంగాణ): కొన్ని రోజులుగా ఎైక్సెజ్, నార్కోటిక్స్ అధికారులు కల్లు దుకాణాలపై దాడులు చేస్తూ గీత కార్మికులను భయాందోళనకు గురిచేస్తున్నారని కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్నగౌడ్ ధ్వజమెత్తారు. ‘కల్లుగీత కార్మికుల జోలికొస్తే ఊరుకునేదిలేదు.. ఖబర్దార్’ అంటూ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కల్లుగీత సొసైటీలను రద్దుచేసి గీత కార్మికుల పొట్టగొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మళ్లీ అదేతీరున ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కల్తీ కల్లు నెపంతో కల్లు దుకాణాలపై దాడులకు ఉసిగొల్పుతున్నదని మండిపడ్డారు. ఈ దాడుల వల్ల చాలా మంది గీతన్నలు జైలులో మగ్గుతున్నారని, వీరి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుగీత వృత్తిని ఎైక్సెజ్శాఖ నుంచి తొలగించి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు వైన్స్ షాపుల్లో రిజర్వేషన్లు, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టడం, సేఫ్టీ మోకులు అందించడంలాంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ డిమాండ్ చేశారు.