అందజేసిన రైతు ఉద్యమకారుడు రాకేశ్ టికాయత్
హైదరాబాద్, ఫిబ్రవరి 22: తెలంగాణ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడికు ‘కిసాన్ రత్న’ అవార్డు లభించింది. రైతుచట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేసిన రైతు నాయకులను కిసాన్ విజయ్ ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మంగళవారం అవార్డులను ప్రదా నం చేశారు. తెలంగాణ నుంచి కోటపాటి నర్సింహ నాయుడు ఎంపికయ్యారు. జాతీయ రైతు ఉద్యమనేత రాకేశ్ టికాయత్ ముఖ్యఅతిథిగా హాజరై అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నరసింహ నాయుడు మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవటం రైతులు సాధించిన ఘన విజయమని పేర్కొన్నారు.
ఎంపీ అర్వింద్ గెలిచిన ఐదు రోజుల్లో పసుపుబోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్‌పై రాసిచ్చి మరీ తెలంగాణ రైతులను మోసం చేశారని ఆరోపించారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏ పార్టీకి బీ టీమ్ కాదని, దేశం ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో జాతీయ రైతు నాయకులు పర్యటించి రైతు సంక్షేమ పథకాలను తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ర్టానికి చెందిన రైతునాయకులు పాట్కూరి తిరుపతిరెడ్డి, ఏముల నరేశ్, కోళ్ల నర్సారెడ్డి, ముత్యంరెడ్డి, చిన్నారెడ్డి తదితరులను విజయోత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. రిటైర్డ్ న్యాయమూర్తి యోగేంద్ర యాదవ్, వినాయక్రావుపాటిల్, బీఆర్ పాటిల్, జాతీయస్థాయి రైతు నాయకులు పాల్గొన్నారు.