హైదరాబాద్, అక్టోబర్5 (నమస్తే తెలంగాణ): నాలుగు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా నందికంటి శ్రీధర్, టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతుబంధు సమితి చైర్మన్‌గా తాటికొండ రాజయ్య, మిషన్‌భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్ గుప్తాను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఆయా పదవుల్లో రెండేండ్లపాటు కొనసాగనున్నారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా వ్యవహరించిన బాజిరెడ్డి గోవర్ధన్ పదవీకాలం కొద్దిరోజుల క్రితమే ముగియడంతో ఆయన స్థానంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి అవకాశం కల్పించింది. ప్రస్తుతం రైతుబంధు సమితి చైర్మన్‌గా కొనసాగుతున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్థానంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను నియమించింది. అత్యంత వెనకబడిన వర్గాల (ఎంబీసీ) డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన నందికంటి శ్రీధర్ 40 ఏండ్లుగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందినవారు.
ఒక్కసారి మాట ఇస్తే దానిని నిలుపుకొని తీరుతామని మరోసారి నిరూపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తాజాగా చేపట్టిన కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్ల నియామకాల్లో ఇదే విషయం స్పష్టమైంది. గులాబీ జెండాను నమ్ముకుంటే పార్టీ గుండెల్లో పెట్టుకుంటుందనే భరోసా కల్పించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యకు క్యాబినెట్ హోదా గల పదవులు ఇచ్చి సముచిత గౌరవం కల్పించారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్‌ను ఈసారి కడియం శ్రీహరికి కేటాయించిన నేపథ్యంలో రాజయ్యకు కార్పొరేషన్ పదవితో సముచిత ప్రాధాన్యం కల్పించారు.
కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఉప్పల శ్రీనివాస్‌గుప్తా ఇటీవల పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మేడ్చల్ మలాజిగిరి డీసీసీ అధ్యక్షుడు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నందికంటి శ్రీధర్ బుధవారం పార్టీలో చేరారు. ఆయా సందర్భాల్లో వీరిద్దరికీ వారి రాజకీయ, ప్రజామోద బలానికి తగ్గట్టుగా సముచిత గౌరవం, స్థానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తమకు కీలక బాధ్యతలు అప్పగించినందుకు నందికంటి శ్రీధర్, ఉప్పల శ్రీనివాస్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ తమ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి సీఎం కేసీఆర్ రుణం తీర్చుకుంటామని చెప్పారు.