యాచారం, జనవరి 18: ‘మా భూములు మాగ్గావాలి. ఫార్మాసిటీ కోసం ఇయ్యం. మా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి’ అని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నానక్‌నగర్ ఫార్మాసిటీ భూబాధిత రైతులు డిమాండ్ చేశారు. ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం సమన్వయ కర్త కవుల సరస్వతి ఆధ్వర్యంలో నానక్‌నగర్‌లో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, మర్లకుంటతండా, మంగళిగడ్డ తండాలకు చెందిన ఫార్మాసిటీ బాధిత రైతులు, వివిధ సంఘాల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సమావేశాన్ని ప్రారంభిస్తున్న సమయంలోనే హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ సీఐ కృష్ణంరాజు, ఎస్సైలు తేజంరెడ్డి, రూపశ్రీ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు.
ఇక్కడ ఎవరిని అడిగి సమావేశం ఏర్పాటు చేశారని, మైకు పెట్టేందుకు వీలు లేదని సీఐ కృష్ణంరాజు వారికి సూచించారు. తమకు హైకోర్టు ఆర్డర్ ఉందని అందుకే సమావేశం నిర్వహించినట్టు సమన్వయకర్త కవుల సరస్వతి బదులిచ్చారు. ఇంతలోనే హైకోర్టు సీనియర్ న్యాయవాది సాదిక్ జోక్యం చేసుకొని రైతులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించడంతో ఎస్సై తేజంరెడ్డి ఆయనపై సీరియస్ అయ్యారు. దీంతో అక్కడి నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు ఆర్డర్ కాపీ చూపించడం, రైతులు వాదనకు దిగడంతో పోలీసులు వెనుదిరిగారు. దీంతో సమావేశం ప్రశాంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఫార్మాసిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసి పథకాలు వర్తించేలా చూడాలని కోరారు.
భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలి
2017 భూసేకరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి సమన్వయకర్త కవుల సరస్వతి డిమాండ్ చేశారు. 31జీవోను రద్దు చేస్తామన్న రేవంత్ సర్కారు అదే జీవోను కొనసాగించడం సరికాదన్నారు. తెలంగాణ పీపుల్స్ జేఏసీ జాయింట్ కన్వీనర్ కన్నెగంటి రవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామన్న ముదిరెడ్డి కోదండరెడ్డి నేడు రైతు కమిషన్ చైర్మన్ కాగానే రైతులు గుర్తుకు రావడంలేదా అని ప్రశ్నించారు.