Nampally Fire Accident : నాంపల్లి ఫర్నీచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న షాపులోని సెల్లార్లో చెలరేగిన మంటల్లో చిక్కుకుని ఐదుగురు మరణించారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి ఒక బాధితుడి కాల్ రికార్డింగ్ ఆడియో లీకైంది.
మృతుల్లో ఒకరైన ఇంతియాజ్ అనే యువకుడు.. అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి, రక్షించమని వేడుకున్నాడు. తాను మంటల్లో లోపల చిక్కుకున్నట్లు, బయటకు రావడానికి ఏమీ కనిపించడం లేదని స్నేహితుడికి చెప్పాడు. అందులోంచి బయటకు రావడానికి అన్ని దారులు మూసుకుపోయాయని ఫోన్లో చెప్పాడు. తనతోపాటు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఇంతియాజ్‌కు సంబంధించిన ఈ ఆడియో వైరల్ అవుతోంది. ప్రాణాలు కోల్పోవడానికి కొద్ది సేపటి ముందు కాల్లో అతడి ఆవేదన అందరినీ కలిచివేస్తోంది. చివరి క్షణాల్లో బాధితుల వేదన కూడా రికార్డైంది. ఘటనకు సంబంధించి.. సెల్లార్‌లోని ఫర్నీచర్ షాపులో మంటలు చెలరేగి, భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
మా ప్రాణాలు పోతున్నాయి కాపాడండి
నాంపల్లి ఫర్నిచర్ షాపు అగ్నిప్రమాద ఘటనలో చిక్కుకున్న బాధితుడి కాల్ రికార్డింగ్
లోపల చిక్కుకున్నాము, ఏమి కనిపించడం లేదు, మేము ముగ్గురం చనిపోతున్నాము, అన్ని మార్గాలు మూసుకుపోయాయి అంటూ భవనం లోపల నుండి ఫోన్ చేసిన బాధితుడు https://t.co/oJd7gnYjKN pic.twitter.com/yXMlHbUkkJ
— Telugu Scribe (@TeluguScribe) January 30, 2026
దీంతో లోపల ఉన్న ఐదుగురు అందులో చిక్కుకుపోయారు. చుట్టూ పొగ, మంటల ధాటికి బయటికి రాలేకపోయారు. బయటికొచ్చే ఏ మార్గం లేకపోవడంతో అందులోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందరూ బయటికొచ్చేశారు. లోపల గార్డు యాదయ్య కుమారులు ప్రణీత్, అఖిల్ ఉండిపోయారు. వారిని కాపాడేందుకు ఉస్మాన్ ఖాన్, ఆయన భార్య బేబి, ఇంతియాజ్ వెళ్లారు. చివరకు ఈ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.