నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను దుర్భాషలాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌ను తొలగించిన కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ జారీచేసింది.
వివరాల్లోకెళితే, 23 నవంబర్ 2020న జీహెఎచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగా కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్న టీఆరెస్ పార్టీ ప్రచారానికి సంబంధించిన ఫ్లెక్సీలను,హోర్డింగులను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, అతడి అనుచరులు చించివేశారనీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను దుర్భాషలాడారంటూ అప్పటి టీఆరెస్ పార్టీ సెక్రెటరీ హోదాలో ఉన్న ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన అప్పటి బంజారాహిల్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ దలి నాయుడు, అజయ్‌కుమార్ ధర్మపురి అరవింద్‌పై కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఆ కేసులో సాక్షుల విచారణ పూర్తయ్యింది. 313 ఎగ్జామినేషన్‌కు తప్పనిసరి రావాల్సి ఉన్నా ధర్మపురి అర్వింద్ రాకపోవడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. అర్వింద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ కేసులో ఫిర్యాదుదారు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తరఫున అసిస్ట్ పీపీగా న్యాయవాద, నాంపల్లి కోర్టు జాయింట్ సెక్రెటరీ జక్కుల లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. ఈ కేసును ఈ నెల 28కి వాయిదా వేశారు.