హైదరాబాద్ మే 22 (నమస్తే తెలంగాణ): శాంతిచర్చలకు ముందుకొచ్చిన మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరిట కాల్చిచంపడం అన్యాయమని పౌరహక్కుల సంఘం నేతలు మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపించారు. కాల్పుల్లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావుతో పాటు 26మంది నక్సల్స్‌ను కాల్చిచంపారని తెలిపారు. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనవిజయంగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
గురువారం ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పౌరహక్కుల సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట సాగిస్తున్న మారణహోమాన్ని నిలిపివేసి, మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు. ధర్నాలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణరావు, టీపీఎఫ్ రా ష్ట్ర కన్వీనర్ నాగభూషణం, సంఘం నేతలు రాంబాబు, ముత్తయ్య, సత్యనారాయణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.