Namaste Telangana | నల్లగొండ రూరల్ : నిర్వహించిన నేషనల్ ఫొటోగ్రఫీ కాంపిటేషన్-2024లో ‘నమస్తే తెలంగాణ’ నల్లగొండ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ ఆర్ ఆకాశ్‌కు అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా 500 ఎంట్రీలు రాగా.. నల్లగొండలో బోనాల సందర్భంగా ఆకాశ్ తీసిన పోతరాజు విన్యాసం ఫొటో కన్సోలేషన్ అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 19న ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
సూర్యాపేట(నమస్తే తెలంగాణ) : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో నమస్తే తెలంగాణ సూర్యాపేట స్టాఫ్ ఫొటోగ్రాఫర్ పీ సైదిరెడ్డి మొదటి అవార్డుకు ఎంపికయ్యారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంశంపై సైదిరెడ్డి తీసిన ఫొటో ప్రథమ అవార్డు దక్కించుకుంది. ఈ నెల 19న హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో అవార్డుతోపాటు నగదు బహుమతిని అందుకోనున్నారు.
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ ‘నమస్తే తెలంగా’ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ బందిగే గోపి జాతీయస్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డుకు ఎంపికైనట్టు ఏపీ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ తెలిపింది. పాలమూరు డైట్ కళాశాలలో మూత్రశాలల వద్ద బారులుదీరిన విద్యార్థినుల వేదనను గుర్తించి తీసిన ఫొటో కన్సోలేషన్ బహుమతికి ఎంపికైంది. ఐపీఆర్ కాంపిటీటివ్‌లో బెస్ట్ న్యూస్ పిక్చర్ కింద సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి అవార్డును అందుకోనున్నారు.