CEO Vikas Raj | హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లే ప్రతి ఒక్క రూ ఆధారాలు, పత్రాలను చూపించాల్సిందేనని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (సీఈవో) వికాస్‌రాజ్ స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని చెప్పారు. వేసవిలో పెళ్లిళ్లు ఉన్నాయని, పెళ్లి కొనుగోళ్లు జరిపేవాళ్లు నగదుకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను వెంట తీసుకెళ్లాలని సూచించారు. పెళ్లిళ్లకు ప్రత్యేకంగా ఎన్నికల కోడ్‌ను సడలించే అవకాశం లేదని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం ‘నమస్తే తెలంగాణ’కు వికాస్‌రాజ్ ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు.
పెండ్లి బట్టలు, బంగారం కొనుగోళ్లకు డబ్బులు ఎలా తీసుకెళ్లాలి?
ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగదుతో వెళ్లేట ప్పుడు ప్రతిఒక్కరూ తగిన ఆధారాలను, పత్రాలను వెంట తీసుకెళ్లడం మంచిది. ఎన్నికలకు సంబంధంలేని డబ్బులు అయితే జిల్లా స్థాయిలోని గ్రీవెన్స్ సెల్స్ యాక్టివేట్ అయ్యాయి. ఆ కమిటీల దగ్గర ఆధారాలు చూపితే ఆ డబ్బులను తిరిగి ఇస్తారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, దుస్తులు, బంగారం కొనుగోళ్లు వంటి డబ్బులకు ఆధారాలను తీసుకెళ్లాలి. కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు కోడ్ ఉంటుంది. కోడ్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందే. వేసవి దృష్ట్యా పోలింగ్ సమయాన్ని పొడిగించే అవకాశం లేదు. గతంలో ఎన్నడూ పోలింగ్ సమయాన్ని పెంచలేదు. ఈ సారి కూడా పెంచం.
ఎన్ని రకాల మెటీరియల్స్ అవసరం?
ఎన్నికల నిర్వహణకు 190 రకాల మెటీరియల్స్ అవసరం ఉంటుంది. అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి కేంద్ర ఎన్నికల సంఘం 27 రకాల సాఫ్ట్వేర్లను రూ పొందించింది. వీటన్నంటిని ఉపయోగించి ఎన్నికల నిర్వహణ మరింత పారదర్శకంగా, జవాబుదారీ తనంతో ఉండే విధంగా చేస్తు న్నాం. కేవీసీ, ఓటర్ టర్న్ అవుట్, ఎక్స్పెండిచర్ యాప్, సువిధ పోర్టల్ ఇలా అనేక రకాలుగా ఐటీని వినియోగిస్తున్నాం.
పోలింగ్ సిబ్బంది గుర్తింపు ప్రక్రియ ఎంత వరకు వచ్చింది?
ఎన్నికల ఏర్పాట్లలో పోలింగ్ సిబ్బంది గుర్తింపు ప్రధాన ప్రక్రియ. రాష్ట్రంలో ఇప్పటికే ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇతర సిబ్బందిని గుర్తించాం. వీరు 1.85 లక్షల మంది అవసరమవుతారని అంచనా వేశాం. వారందరనీ గుర్తించాం. వీరికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ దగ్గరికి వచ్చాక వీరికి శిక్షణ ఇస్తాం. వీరికి శిక్షణ ఇచ్చే సమయంలో పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు ఫా రం ఇస్తాం. వారు ఎక్కడ ఓటు వేస్తారో అందు లో ఆప్షన్ ఇస్తాం. వారికి ఓటు ఉన్న నియోజకవర్గంలో ఓటు వేస్తారా లేక పనిచేసే దగ్గర ఓటు వేస్తారా అనేది వారికి ఆప్షన్‌గా ఇస్తాం. దీని కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తయారు చేసింది. గతంలో వారి కి ఓటు ఉన్న నియోజకవర్గంలోని ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర మాత్రమే ఓటు వేసే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు రెండు ఆప్షన్లు ఇస్తు న్నాం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో లాగా కాకుండా ఉద్యోగులకు కొంత వెసులుబాటు ఉండేలా నిర్ణయం తీసుకున్నాం.
ఈవీఎంలు రెడీగా ఉన్నాయా.. చెక్ చేశారా?
ఈవీఎంలు రెడీ చేశాం. ఇప్పటికే తొలిదశ చెకింగ్ (ఎఫ్ఎల్సీ) పూర్తి చేశాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశిస్తే రెండోదశ చెకింగ్ చేస్తాం. రెండో దశలో జిల్లా కేంద్రం నుంచి నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలు వెళ్తాయి. వీటన్నంటి కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను ఈసీ తయారు చేసింది. ఏ ఈవీఎం ఎక్కడికి వెళ్లింది అనేది ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది. 25 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కోర్టు కేసులు ఉండటంతో ఆ నియోజకవర్గాల్లోని ఈవీఎంలను వినియోగించడంలేదు. దీంతో అదనపు ఈవీఎంలను తెప్పించాం. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు అవసరమైనన్ని ఉన్నాయి. ఈ సారి జిల్లా కేంద్రంలోనే పోస్టల్ బ్యాలెట్లను ప్రింట్ చేసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు సూచించాం. వారికే అధికారం ఇచ్చాం. దీని ద్వారా త్వరగా పోస్టల్ బ్యాలెట్ల ముద్రణ అవుతుంది. కౌంటింగ్ సెంటర్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను గుర్తించాం.
ఎంత మందితో బందోబస్తు ఉంటుంది?
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి రాష్ర్టానికి ఇప్పటికే 40 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. మరో 100కు పైగా కేంద్ర బలగాలు రాష్ర్టానికి వస్తాయి. వీరితోపాటు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాల నుం చి రాష్ర్టానికి పోలీసులు వస్తారు. రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అసెం బ్లీ ఎన్నికల్లో ప్రశాంతంగా, ఒక్క పోలింగ్ కేం ద్రంలో కూడా రిపోలింగ్ లేకుండా నిర్వహిం చాం. అదే విధంగా నిర్వహించడానికి ఏర్పా ట్లు చేస్తున్నాం.
ఓటర్ల సంఖ్య ఏమైనా పెరిగిందా?
రాష్ట్రంలో 2018 ఎన్నికల్లో 2.05 కోట్ల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటే 2023 నాటి కల్లా 2.32 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది 2018 కంటే 13 శాతం అధికం. ఓటింగ్ శాతం తక్కువగా అయినట్లుగా కనిపిస్తున్నా… ఓటర్ల సంఖ్య పరంగా పరిశీలిస్తే 13 శాతం అధికం. రాష్ట్రంలో అతి తక్కువ పోలింగ్ అయిన పోలింగ్ కేంద్రాలు ఐదు వేలు ఉన్నాయి. అక్కడ ఎందుకు పోలింగ్ తక్కువ జరిగిందో పరిశీలించాం. ఎండాకాలం నేపథ్యంలో మంచినీరు, కుర్చిలు, అవసరమైతే టెంట్లు వేస్తాం. దివ్యాంగులకు వీల్ చైర్లు, మూత్రశాలలు అందుబాటులో ఉంచుతాం.
రాష్ట్రంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి?
మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశాం. 1,400 మందికిపైగా ఓటర్లు ఉన్నారు. వీరికి 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లను చేశాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ ఏర్పాట్లు చేశాం. మరో వైపు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేశాం. లోక్‌సభతోపాటు ఎన్నికలు నిర్వహిస్తాం. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
85 ఏండ్ల వృద్ధులు హోం ఓటింగ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
దివ్యాంగులు, 85 ఏండ్ల వయస్సు దాటిని వారికి హోం ఓటింగ్ సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. వీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నాక.. రెండు రోజుల తరువాత బ్యాలెట్ పేపర్ ముద్రించాక ఓటింగ్ ప్రారంభిస్తాం. ఎన్నికల తేదీకి ఐదు రోజుల ముందుగా పూర్తిచేస్తాం. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాం. వీరు 12 డీ ఫాం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఆ విధానంలోనే ఓటు వేయాల్సి ఉంటుంది. మళ్లీ సాధారణ పద్దతిలో ఓటు వేస్తామంటే అనుమతించం.
ఓటు కోసం ఎప్పటివరకు దరఖాస్తు చేసుకోవచ్చు?
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తరువాత 12.53 లక్షల కొత్త ఓటర్లు చేరారు. 7.80 లక్షల ఓటర్ల తమ వివరాల్లో మార్పులు చేసుకున్నారు. ఇలా 20.33 లక్షల ఓటర్లకు కొత్త కార్డులు ముద్రించి ఇస్తాం. ఇందులో ఇప్పటికే 10 లక్షల కార్డులు ముద్రించాం. 8 లక్షల కార్డుల ముద్రణకు ఆర్డర్ ఇచ్చాం. మరో 2 లక్షల కార్డుల ముద్రణకు ఆర్డర్ ఇవ్వాల్సి ఉన్నది. ఇంకా ఒక లక్ష కొత్త దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నాం. వీరందరికీ ఓటింగ్ నాటి కల్లా కొత్త ఓటరు కార్డులను ముద్రించి పంపిణి చేస్తాం. ఓటు హక్కు లేని వారు కొత్త ఓటు హక్కు కోసం ఏప్రిల్ 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయిన వారు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరిలో అర్హులైన వారికి ఓటు హక్కు కల్పిస్తాం.
కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో తనిఖీలు చేపడుతున్నారా?
ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా తనిఖీలు చేపట్టాం. రాజకీయ కార్యకలాపాలు పెరిగితే తనిఖీలను పెంచుతాం. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు తనిఖీలు చేస్తాయి. చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం. వాటిలో సీసీ కెమెరాలను పెట్టాం. వీటన్నంటిని పర్యవేక్షించడానికి కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నాం. రాజకీయ పార్టీలు ఇచ్చే ప్రకటనలకు తప్పనిసరిగా ఎంసీఎంసీ ఆమోదం తీసుకోవాల్సిందే. ఈ-పేపర్, డిజిటల్ మీడియాలో ప్రచురించే, ప్రచారం, ప్రసారం చేసే వాటికైనా అనుమతి తీసుకోవాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదు అయినా ఎంసీఎంసీ కేసులు కొనసాగుతున్నాయి. వాటిపై విచారణ కొనసాగుతున్నాయి.
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలి?
ఎన్నికల్లో జరిగే అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై 1950, సీ విజిల్ యాప్‌ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వారి ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తాం. ప్రజలు బాధ్యతగా అక్రమాలు, మద్యం, డబ్బు పంపిణీపై ఫి ర్యాదు చేయవచ్చు. అనుమతి లేకుం డా మీటింగ్‌లు, ర్యాలీలు చేసినా ఫిర్యా దు చేయవచ్చు. ఎన్నికలకు పరిశీలకు లు నామినేషన్ల చివరి రోజున రాష్ర్టానికి వస్తారు. ఎంత మందిని నియమించారనేది త్వరలో సమాచారమిస్తారు.