హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19(నమస్తే తెలంగాణ) : జూబ్లీ క్లబ్ పెద్దల అక్రమాలను ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ ఫేజ్-4 పేరుతో క్లబ్ పెద్దలు చేసిన భూమాయను బట్టబయలు చేసింది. మంచిరేవులలో ఓ బిల్డర్‌కు సంబంధించిన 16 ఎకరాల భూమిని తమ భూమిగా చూపించి కొత్త సభ్యత్వాల పేరుతో లక్షలు వసూలు చేసి అసలు తమకు సంబంధం లేని భూమిలో టవర్స్ నిర్మించి కొత్త సభ్యులకు ఇస్తామంటూ చేసిన మోసాన్ని వెలుగులోకి తెచ్చింది. జూబ్లీ క్లబ్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో టవర్స్ నమూనాను చూపించి మంత్రి తుమ్మలతో అట్టహాసంగా ప్రారంభోత్సవం చేసిన ఈ భూ బాగోతంలో ప్రభుత్వ పెద్దలతో పాటు ఓ చానల్ యజమాని పాత్రను సాక్ష్యాధారాలతో ప్రచురించింది. ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన పత్రికలో ‘గన్ గేమ్.. పేలిన భూ స్కామ్’ శీర్షికతో మంగళవారం ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో సంచలనం సృష్టించింది.
రెండు తెలుగు రాష్ర్టాల్లో ఉన్న పెద్దమనుషులకు సంబంధమున్న జూబ్లీ క్లబ్లో ఇంత పెద్ద మోసం జరిగిందా? అంటూ చర్చ మొదలైంది. ఈ వ్యవహారమంతా జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ పెద్దలతో పాటు ఏకంగా ముఖ్యనేత, బిగ్ బ్రదర్స్, మంత్రి కొండా సురేఖ.. ఇలా ఒకరికొకరికి ముడిపడి ఉండటంతో ముఖ్యమంత్రి కార్యాలయంలో కలకలం రేగింది. ఆ క్లబ్లో సభ్యత్వం ఉంటే చాలు అంటూ ప్రతిష్ఠాత్మకంగా భావించే జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో సభ్యత్వంతో పాటు జూబ్లీ క్లబ్లో సభ్యత్వం ఇస్తామంటూ ఆశ చూపి ఒక్కొక్కరి వద్ద ఐదు లక్షల రూపాయలతోపాటు అదనంగా వసూలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్లబ్ చైర్మన్ రవీంద్రనాథ్, ఇతర పాలకమండలి సభ్యులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లారంటూ జూబ్లీ క్లబ్లో చర్చ జరుగుతున్నది. సభ్యత్వాలు కట్టిన పది, పదిహేను మంది క్లబ్లో ఉన్న సొసైటీ కార్యాలయం వద్దకు మంగళవారం వచ్చి అక్కడ ఉన్న ఏవోకు ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాన్ని చూపిస్తూ వాస్తవాలపై ప్రశ్నించినట్టు తెలిసింది.
తమకు ఫ్ల్లాట్లు ఇస్తామని, క్లబ్ మెంబర్షిప్ ఇస్తామని చెప్పి పట్టించుకోకపోవడమే కాకుండా.. అసలు లేని భూమిలో టవర్లు ఎలా నిర్మిస్తారంటూ ఏవోను నిలదీసినట్టు సమాచారం. ఈ విషయం తనకు తెలియదని, ఇదంతా చైర్మన్, కోశాధికారి చూసుకుంటున్నారని, వారిని అడుగాలని ఏవో చెప్పడంతో ఆ సభ్యులంతా చైర్మన్‌ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదని తెలిసింది. దీంతో కొత్త సభ్యులంతా అసలు తాము కట్టిన డబ్బుకు ఎవరు బాధ్యులని, అటు సొసైటీలో ఫేజ్ 4 ముందుకు సాగుతుందా?, భూమే లేనిచోట టవర్స్ ఎలా కడుతారు? అని అడిగినా చెప్పే వారు లేకపోతే తమ పరిస్థితి ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో తమకు సరైన సమాధానం దొరకకపోతే తామంతా రెండు, మూడురోజుల్లో న్యాయపరంగా ముందుకుపోవాలని భావిస్తున్నట్టు సొసైటీలో సభ్యత్వం తీసుకున్న కొత్త సభ్యుడు తెలిపారు. చైర్మన్, ఇతర సభ్యులు ఎవరూ తమకు అందుబాటులో రావడం లేదని వాపోయారు.
ఇదిలా ఉంటే మంచిరేవులలో పెద్ద ఎత్తున భూ పందేరానికి ప్రణాళిక సిద్ధం చేసిన జూబ్లీ క్లబ్ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం నేపథ్యంలో ఈ పంచాయితీ సీఎంవోకు చేరింది. జూబ్లీ క్లబ్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా సభ్యుడు కావడంతో కొత్త సభ్యుల పేరుతో జరిగిన భూదందా ఆయనకు తెలియకుండానే జరిగిందా? అంటూ సభ్యులు చర్చించుకుంటున్నారు. గతంలో కొండా సురేఖ కూతురు సుస్మిత ఆరోపించిన మంచిరేవుల పంచాయితీలో మరోసారి ‘బిగ్ బ్రదర్స్’ పేరు రావడం, కొండా సుస్మితతో తెరపైకి వచ్చి సద్దుమణిగిన పాతకథలో డెక్కన్ సిమెంట్స్, మంచిరేవుల దేవాదాయ భూములతో జూబ్లీహిల్స్ భూ పందేరం ముడిపడి ఉండటంతో సీఎంవోలో కలకలం చెలరేగింది. జూబ్లీ క్లబ్లో కొత్త సభ్యులకు ఫ్ల్లాట్లు ఇస్తామంటూ చూపించిన భూమికి, క్లబ్‌కు సంబంధం లేకుండానే కేవలం అరగంట వ్యవహారంతో సుమారు రెండువేల మంది సభ్యులకు అరచేతిలో వైకుంఠం చూపి లక్షలు కట్టించుకున్న వైనం బయటపడిన నేపథ్యంలో ఈ దందా ముఖ్యమంత్రికి, ప్రారంభోత్సవం చేసిన సహకార శాఖ మంత్రి తుమ్మలకు తెలియకుండానే జరిగిందా? అంటూ నగరంలోని ముఖ్య వ్యక్తుల మధ్య చర్చ జరుగుతున్నది.
దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉదయమే జూబ్లీ క్లబ్ ఫేజ్ 4 భూపందేరంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు కీలక వ్యక్తులను సీఎం ఆఫీస్‌కు రావాల్సిందిగా కబురుపెట్టినట్టు సమాచారం. ఆ ఇద్దరు పెద్దమనుషులను సీఎం కలవకుండానే ఓ ముఖ్యమైన వ్యక్తికి వారి వివరణ తీసుకునే పని అప్పచెప్పినట్టు తెలిసింది. ఆ ఇద్దరు మాత్రం వేరే అధికారులు, కొందరు ప్రజాప్రతినిధుల ద్వారా ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు సహకారశాఖ అధికారులు కూడా జూబ్లీ క్లబ్ అక్రమాలపై ఆరా తీసినట్టు సమాచారం. గతంలోనే దీనిపై కోర్టు వివాదం కొనసాగున్నా లేని భూమిని తమదిగా చూపించి సభ్యులను కో ఆపరేటివ్ సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా సభ్యత్వాలు చేసిన వ్యవహారంపై మరోసారి ఆరా తీసినట్టు సమాచారం. సొసైటీ రిజిస్ట్రార్‌కు సంబంధించిన సిబ్బంది జూబీ ్లక్లబ్లోని సొసైటీ ఆఫీస్‌కు వచ్చి ఏవోతో మాట్లాడినట్టు తెలిసింది. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో పలు అక్రమాలు జరుగుతున్నాయంటూ వచ్చిన ఆరోపణలపై సొసైటీ రిజిస్ట్రార్ సెక్షన్ 51 కింద విచారణ చేపట్టనున్నట్టు తెలిసింది.