ఖలీల్వాడి, డిసెంబర్ 8: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో విజయవంతమైంది. ఆటోషోను శనివారం నగర మేయర్ నీతూకిరణ్ ప్రారంభించగా.. ఆదివారం సాయం త్రం వరకు కొనసాగింది. నగరవాసులు పెద్ద సం ఖ్యలో తరలివచ్చారు. అన్ని కంపెనీలకు చెందిన వాహనాలను ఒకే గొడగు కిందికి తీసుకువచ్చి ప్రదర్శించారు. సందర్శకులు స్టాళ్లల్లో బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలు, కార్లను పరిశీలించారు.
కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి వాహనాల ధరలను తెలుసుకున్నారు. ఆటోషోలో మొత్తం 16 స్టాల్స్ ఏర్పాటు చేయగా.. కొనుగోలుదారులు కార్లు, బైక్లు, ఎలక్ట్రానిక్ కార్లు, బైక్లు, స్కూటీలను బుక్ చేసుకున్నారు. బైక్, స్కూటీ ధరలు రూ. 80 వేల నుంచి రూ.4 లక్షలు వరకు ఉండగా.. కార్ల ధరలు రూ. 7 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు అందుబాటులో ఉంచారు. చాలామంది టెస్ట్ డ్రైవ్ చేసి వాహనాల పనితీరును తెలుసుకొన్నారు. ఆటోషో ప్రాంగణం ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులతో కిటకిటలాడింది.
‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో విజయవంతమైందని, ఇలాంటి ఆటో షోలు మరిన్ని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. ఆదివారం ఆటోషో ముగింపు కార్యక్రమానికి హాజరైన ఆయన స్టాళ్లను సందర్శించి వాహనాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మహిళలకు రూ. 2500తోపాటు స్కూటీ ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సన్రైజ్కీయా మేనేజింగ్ డైరెక్టర్ రవికిరణ్గౌడ్, మాజీ జడ్పీటీసీలు జగన్, మహీపాల్రెడ్డి , నమస్తేతెలంగాణ బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, బ్యూరో ఇన్చార్జి జూపల్లి రమేశ్రావు, ప్రకటనల విభాగం మేనేజర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.