జయశంకర్ భూపాలపల్లి, మే 15 (నమస్తే తెలంగాణ): ‘కొలువుల దందాలో కోటికి స్కెచ్’ అనే శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం భూపాలపల్లి కోల్బెల్ట్ ఏరియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. సమారు 30 మంది నిరుద్యోగుల నుంచి రూ.3లక్షల చొప్పున వసూలు చేసిన దళారులకు ‘నమస్తే కథనం’ గుబులు పుట్టిస్తున్నది. ప్రైవేటు సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల కోసం రెండు రోజుల క్రితం కొత్తగా టెండర్ ఓపెన్ కాగా అందులో 27 మందిని చేర్చుకోనున్నారు.
ఈ మేరకు దళారులు రంగ ప్రవేశం చేసి 30 మంది బయోడేటా, డబ్బులు తీసుకొని సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కార్మిక సంఘం నాయకులు ఈ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం కాగా సింగరేణి అధికారులు దీనిపై ఓ కన్నేశారు. గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన ఇద్దరు జీఎంలు తమను సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల కోసం ఎంపిక చేసి మెడికల్, వీటీసీ చేయించారని, కొత్తగా వచ్చిన 27 పోస్టుల్లోకి తీసుకోవాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.