హైదరాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫొటో జర్నలిస్టుల సంఘం నిర్వహించిన ‘రాష్ట్ర స్థాయి న్యూస్ ఫొటో కాంపిటీషన్ -2024’లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఫొటో జర్నలిస్టులకు అవార్డులు వరించాయి. మొత్తం 28 మందికి అవార్డులు ప్రకటించగా, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే నుంచి నలుగురు ఎంపికయ్యారు. తెలంగాణ ఫొటోజర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కేఎన్ హరి మాట్లాడుతూ.. 31 జిల్లాల నుంచి 100 మంది ఫొటోజర్నలిస్టులు తమ ఎంట్రీలను పంపారని చెప్పారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశామని తెలిపారు.
సీనియర్ జర్నలిస్ట్, సీఎం సీపీఆర్వో బీ అయోధ్యరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ సుశీల్‌రావు, సీనియర్ ఫొటోజర్నలిస్ట్ హెచ్ సతీశ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి, ఉత్తమ వార్త చిత్రాలను ఎంపిక చేశారని పేర్కొన్నారు. ప్రథమ బహుమతికి మహిమల భాసర్‌రెడ్డి, వెలుగు (సిద్దిపేట), ద్వితీయ బహుమతికి పీ సురేంద్ర, డెకన్ క్రానికల్ (హైదరాబాద్), తృతీయ బహుమతికి ఏ తరుణ్, టైమ్స్ అఫ్ ఇండియా (హైదరాబాద్) ఎంపికయ్యారని తెలిపారు. 25 మందికి కన్సోలేషన్ బహుమతులు ప్రకటించినట్టు చెప్పారు.
వీరిలో నమస్తే తెలంగాణ నుంచి గడసంతల శ్రీనివాస్ (హైదరాబాద్), గోపి కృష్ణ (హైదరాబాద్), బందగీ గోపి (మహబూబ్‌నగర్), సూర్య శ్రీధర్, తెలంగాణటుడే (హైదరాబాద్) ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఛాయా చిత్ర ప్రదర్శనను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామనారాయణ హాజరవుతారని వెల్లడించారు.