గిఫ్ట్ వచ్చిందని మెయిల్ వచ్చిందా? లాటరీ గెలుచుకొన్నారని ఫోన్ చేశారా? దరఖాస్తు చేయని ఉద్యోగానికి మిమ్మల్ని సెలెక్ట్ చేసినట్టు మెసేజ్ చేశారా? తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తామని ఆశ పెడుతున్నారా? పెండ్లి చేసుకొందాం.. పాస్‌పోర్టు, వీసా తీయాలి, డబ్బు పంపించు అని అడుగుతున్నారా?.. తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని ఆశపెట్టి, బుట్టలో వేసుకొని, వ్యక్తిగత డాటా చోరీచేసి, బ్లాక్మెయిల్ చేసి, బురిడీ కొట్టించే ఘరానా కేటుగాళ్లు కంప్యూటర్ల ముందు కాచుకొని కూర్చున్నారు. ఆశపడ్డారో మీ బ్యాంక్ ఖాతాలన్నీ ఖాళీ చేసేస్తారు. చాలా మందికి సైబర్ నేరాలపై అవగాహన లేకపోవటంతో మోసాలు ఎక్కువవుతున్నాయి. మన అవగాహన, మన అప్రమత్తతే ఈ సైబర్ నేరాల నుంచి మనకు శ్రీరామరక్ష. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, మోసపోతే వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న సందేహాలకు సమాధానాలు, సలహాలతో ‘నమస్తే తెలంగాణ’ సమగ్ర కథనం..
ఆన్లైన్ మోసాల్లో విషింగ్ కాల్స్ సైతం ఒక తరహా మోసం. ఇందులో సైబర్ నేరగాళ్లు వాయిస్ ఈ-మెయిల్ లేదా వాయిస్ ఓవర్ ఐపీ(వీఓఐపీ) లేదా ల్యాండ్‌లైన్/సెల్‌ఫోన్ నుంచి కాల్ చేస్తారు. మన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందని, అప్డేట్ చేయాలని, కొన్ని వివరాలు వెంటనే ఇవ్వాలని కోరుతారు. లేదంటే బ్యాంక్ ఖాతా స్తంభించిపోతుందని భయపెడతారు. అలా అవతలి వ్యక్తి కంగారులో ఉన్నపుడు బ్యాంక్ ఖాతా నంబర్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు నంబర్, పిన్, సీవీవీ నంబర్ తీసుకొని మన ఖాతాలోని డబ్బును కొల్లగొడతారు.
తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తామని సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తున్నారు. ఇందుకోసం టాటా క్యాపిటల్, బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థల పేర్లను, లోగోలను వాడుతున్నారు. అమాయకులు ఎవరైనా నమ్మి సంప్రదిస్తే రిజిస్ట్రేషన్ ఫీజు, జీఎస్టీ అంటూ డబ్బులు తీసుకుని మోసగిస్తున్నారు.
భారీ మొత్తంలో లాటరీ గెలుచుకున్నారు అంటూ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్/ఈమెయిల్ వస్తుంది. చెక్ ఫొటోను కూడా పంపుతారు. కోకా-కోలా, సామ్సంగ్, మైక్రోసాఫ్ట్, టాటా కంపెనీల పేరిట ఈ లాటరీ ఫ్రాడ్స్‌ను నైజీరియన్లు ఎక్కువగా చేస్తుంటారు. స్థానిక గ్యాంగ్‌లు స్నాప్‌డీల్, అమెజాన్, షాప్‌క్లూస్ పేరిట లాటరీ మోసాలు చేస్తున్నాయి.
నౌకరీ.కామ్, షైన్.కామ్, ఇండీడ్ టైమ్స్‌జాబ్స్.కామ్ వంటి వాటి డాటాబేస్ నుంచి సైబర్‌మోసగాళ్లు మన సమాచారం సేకరిస్తారు. ఆ తర్వాత ఓ ఎంఎన్సీలో ఉద్యోగం ఉంది చేరాలంటూ తొలుత ఆఫర్ లెటర్, ఈమెయిల్స్, లేదా కాల్ ద్వారా సమాచారం ఇస్తారు. తీరా అందులో చేరాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలంటూ విడతల వారీగా డబ్బు లాగడం మొదలు పెడతారు. ఇండియన్ జాబ్‌ఫ్రాడ్ గ్రూప్‌లైతే టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐబీఎం కంపెనీల పేర్లతో, నైజీరియన్ జాబ్ ఫ్రాడ్ గ్రూప్‌లైతే కెనడా వీసా, అమెరికా వీసా అంటూ మోసాలు చేస్తున్నాయి.
మీరు ఆన్లైన్లో ప్రైజ్‌లు గెలుచుకున్నారు అంటూ స్నాప్‌డీల్, న్యాప్‌టోల్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్, అమెజాన్, హోమ్స్షాప్, షాప్‌క్లూస్ వంటి ఈకామర్స్ సైట్ల పేరిట బల్క్ ఎస్ఎంఎస్లు, లేదా ఈమెయిల్స్ పంపుతారు. మిమ్మల్ని నమ్మించేందుకు కొన్ని మెయిల్స్‌లో సదరు కంపెనీ ఉద్యోగులమంటూ నకిలీ ఐడీ కార్డుల ఫొటోలను కూడా జత చేస్తారు. మనం వాళ్ల వలలో పడ్డట్టు నిర్ధారించుకున్న తర్వాత మీకు గిప్ట్ పంపేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు, సర్వీస్ చార్జీలు, జీఎస్టీ, ప్రాసెసింగ్ ఫీజు అంటూ డబ్బులు లాగడం మొదలు పెడతారు. ఇలాంటివి ఎక్కువగా బీహార్ నుంచి వస్తున్నాయి.
ఆన్లైన్ బ్యాంక్ ఖాతాల యూజర్‌నేమ్, పాస్వర్డ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల వివరాలు తెలుసుకొనేందుకు సైబర్ నేరగాళ్లు మనకు బ్యాంక్‌ల పేరిట నకిలీ వెబ్సైట్లు క్రియేట్ చేసి వాటికి సంబంధించిన లింకులను మన ఈమెయిల్‌కు పంపుతారు. దీన్నే మనం ఫిషింగ్ మెయిల్స్ అంటాం. ఆ మెయిల్లో మనకు వచ్చే లింక్‌పై క్లిక్ చేయగానే బ్యాంక్ హోం పేజీ వంటి ఓ నకిలీ పేజీ ఓపెన్ అవుతుంది. అది మన బ్యాంక్ వెబ్సైట్ అనుకొని మన వివరాలు పొందుపరుస్తాం. ఆ లింక్‌లో మనకు కనిపించకుండా సైబర్ నేరగాళ్లు మన కంప్యూటర్లోకి మాల్వేర్ను పంపుతారు. ఇలా మన వివరాలు తీసుకొన్నాక వాటితో మన ఆన్లైన్ బ్యాంక్‌ఖాతా తెరిచి డబ్బులు కొట్టేస్తారు.
ఇటీవల కాలంలో ఈ తరహా ఫేస్బుక్ మోసాలు బాగా పెరిగాయి. గతంలో సెలబ్రిటీలు, పోలీస్ అధికారులకే పరిమితమైన ఈ ఫేస్బుక్ ఫ్రాడ్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు ఇప్పుడు సామాన్యుల వరకు పాకింది. సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్‌లోని మన ప్రొఫైల్ ఫొటోలు, సమాచారాన్ని సేకరించి అచ్చం అలాగే మరో ఫేస్బుక్ ఖాతాను తెరుస్తున్నారు. తిరిగి కాంటాక్ట్ లిస్ట్‌లోని వారందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. ఎదుటి వ్యక్తి వాటిని యాక్సెప్ట్ చేయగానే..అత్యవసరం అని, మళ్లీ వెంటనే తిరిగి ఇచ్చేస్తానని, డబ్బులు పంపాలని గూగుల్‌పే, ఫోన్‌పే నంబర్లు ఇస్తున్నారు. చాలా ఘటనల్లో స్నేహితుడి కోసమే కదా అని అవతలి వ్యక్తులకు గుడ్డిగా డబ్బు పంపేస్తున్నారు.
నైజీరియన్ సైబర్ గ్యాంగ్‌లు ఈ తరహా మోసాలు ఎక్కువగా చేస్తున్నాయి. తొలుత ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెడతారు. యాక్సెప్ట్ చేయగానే చాటింగ్‌లోకి వస్తారు. కొంత పరిచయం పెంచుకున్న తర్వాత మీ కోసం ఇండియాకు గిఫ్ట్‌లు పంపుతున్నానని లేదంటే గిఫ్ట్‌లు తీసుకుని మిమ్మల్ని కలిసేందుకు వస్తున్నానంటూ మెసేజ్‌లు పెడతారు. కొద్ది రోజుల తర్వాత కొత్త నంబర్ల నుంచి ఫోన్ చేసి మేం ఎయిర్పోర్ట్ అధికారులం అని, కస్టమ్స్ అధికారులం అని ఫోన్‌కాల్ చేస్తారు. మీకు గిఫ్ట్‌లు వచ్చాయి. వీటిని మీకు పంపాలంటే పన్నులు చెల్లించాలని డిమాండ్ చేసి, డబ్బు వసూలు చేస్తారు..
సైబర్ నేరగాళ్లు మన సమాచారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీల డాటాబేస్, బ్రోకింగ్ కంపెనీల డాటాబేస్ నుంచి తీసుకుంటారు. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్టుగా నమ్మిస్తారు. చాలా ఎక్కువ మొత్తంలో లాభాలు, ఇతర ఆఫర్లు ఉన్నాయని ఊరిస్తూ కొత్త పాలసీలు తీసుకొనేలా ప్రోత్సహించి ఆన్లైన్ పాలసీ అని మన డబ్బు లాగేస్తారు.
ఆన్లైన్ మోసం జరిగినట్టు గమనించిన వెంటనే 155260 నంబర్‌కు ఫోన్ చేయాలి.పోలీసులు వెంటనే ఫిర్యాదు తీసుకోవటంతోపాటు బ్యాంక్‌కు సమాచారం ఇచ్చి లావాదేవీలను స్తంభింపజేస్తారు.
155260ఆన్లైన్ మోసాలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోంశాఖ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం హెల్ప్‌లైన్ నంబర్ 155260 అమల్లోకి తెచ్చింది.
www.cybercrime.gov.in
నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. www.cybercrime.gov.in లోకి వెళితే ఫైల్ ఏ కంప్లయింట్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి.
18004256235
సైబర్ నేరాల నియంత్రణపై అవగాహనకు, ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో జాగ్రత్తలపై www.infosecawareness.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 18004256235లో సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.